Mohammed Shami : షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా? అంత బాధ ఎక్కడిది? ఏంటా విషాద కథ?

మహమ్మద్ షమీ ఉమేష్ కుమార్ కు స్నేహితుడు. 2018లో కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఉమేష్ కుమార్ ఇంట్లోనే షమీ నివసించేవాడు. ఉమేష్ కుమార్ కుటుంబం 19వ అంతస్తులో నివసించేది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అప్పట్లో షమీ తీవ్రంగా కుమిలిపోయాడు. ఎంతో ఆవేదన చెందేవాడు. అప్పట్లో మీడియాలో మహమ్మద్ షమీ తీవ్రమైన నిర్ణయం తీసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి

Written By: Anabothula Bhaskar, Updated On : July 24, 2024 5:42 pm
Follow us on

Mohammed Shami : మహమ్మద్ షమీ.. సమకాలీన క్రికెట్ లో అద్భుతమైన బౌలర్. టీమిండియాలో చురుకైన ఆటగాడిగా పేరుపొందాడు.. జట్టు సాధించిన పలు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆటపరంగా షమీ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఈ స్థాయి దాకా వచ్చాడు. బౌలింగ్ విషయంలో అతడికి పెద్దగా అడ్డంకులు లేవు. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకులమయం. 2018లో షమీ జీవితం అల్ల కల్లోలం అయింది. అతని భార్య గృహహింస కేసు పెట్టింది. దీనికి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అతడి కెరియర్ నేల చూపులు చేసేలా చేశాయి. దీంతో ప్రతిరోజు అతడికి సంబంధించిన ఏదో ఒక వార్త అటు మీడియాను, ఇటు సోషల్ మీడియాను షేక్ చేసేది. కొద్దిరోజులు అనంతరం అతడు ఫిక్సింగ్ ఆరోపణ నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో మహమ్మద్ షమీ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని అతడి స్నేహితుడు ఉమేష్ కుమార్ ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సంచలన విషయాలు వెల్లడించాడు.

పోరాడుతూనే ఉన్నాడు

మహమ్మద్ షమీ ఉమేష్ కుమార్ కు స్నేహితుడు. 2018లో కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఉమేష్ కుమార్ ఇంట్లోనే షమీ నివసించేవాడు. ఉమేష్ కుమార్ కుటుంబం 19వ అంతస్తులో నివసించేది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అప్పట్లో షమీ తీవ్రంగా కుమిలిపోయాడు. ఎంతో ఆవేదన చెందేవాడు. అప్పట్లో మీడియాలో మహమ్మద్ షమీ తీవ్రమైన నిర్ణయం తీసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఒకరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఉమేష్ కుమార్ లేచి మంచినీళ్లు తాగేందుకు తన గదిలో నుంచి బయటికి వచ్చాడు. ఆ సమయంలో షమీ బాల్కనీలో నిలబడి ఉన్నాడు. అప్పుడు అతడు ఏం చేసుకోబోతాడో ఉమేష్ కుమార్ ఒక అంచనాకు వచ్చాడు. ఆ తర్వాత షమీతో మనస్ఫూర్తిగా మాట్లాడాడు.. అలా షమిని కాపాడగలిగాడు.

నాటి నుంచి

ఇక నాటి నుంచి షమీతో ఉమేష్ కుమార్ మరింత చనువు పెంచుకున్నాడు. అతడి మనసులో ఉన్న భారాన్ని తగ్గించి.. అతన్ని తేలిక చేసేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న కమిటీ నుంచి షమీకి క్లీన్ చిట్ మెసేజ్ వచ్చింది. ఆరోజున షమీ పట్టరాని ఆనందంతో కేకలు వేశాడు. అయితే షమీ తన భార్య పెట్టిన కేసుల వల్ల ఇప్పటికి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. పలు సందర్భాల్లో తాను నిరపరాధినని.. ఎందుకు నన్ను ఆమె టార్గెట్ చేస్తుందో అర్థం కావడం లేదని షమీ వాపోయాడు. ఆమెను ప్రేమగా చూసుకున్నప్పటికీ.. తనపై విపరీతమైన ద్వేషం పెంచుకుందని.. అలాంటి మహిళను తన జీవితంలో చూడలేదని షమీ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వాపోయాడు. ఫిక్సింగ్ ఆరోపణ నుంచి బయటపడ్డ తర్వాత వన్డే వరల్డ్ కప్ లో షమీ సత్తా చాటాడు. దురదృష్టవశాత్తు ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయినప్పటికీ షమీ తన అద్భుతమైన బౌలింగ్ తో భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. వరల్డ్ కప్ తర్వాత షమీ చీలమండ గాయం కారణంగా చికిత్స చేయించుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2024, టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటలేకపోయాడు. లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. శ్రీలంక పర్యటన తర్వాత బంగ్లాదేశ్ తో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ నాటికి షమీ జట్టులోకి ఎంట్రీ అవకాశం కనిపిస్తోంది.