IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే దూకుడుకు సిసలైన పర్యాయపదం. అటువంటి మ్యాచ్ ల్లో కెప్టెన్లపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న నిర్ణయం జట్టుకు లాభం చేకూర్చితే అందరూ జేజేలు పలుకుతారు. అదే తేడా అయితే అదేనోళ్లతో విమర్శిస్తారు. ఇటువంటి ఒత్తిడి ఉన్న టీ-20 ల్లో ధోని, రోహిత్ శర్మ తిరుగులేని కెప్టెన్సీ ని ప్రదర్శించారు. చెన్నై జట్టును, ముంబై జట్టును అత్యంత విజయవంతమైన టీం లు గా ఆవిర్భవించేలా చేశారు. అలాంటి దిగ్గజాల కెప్టెన్సీ ని ప్రస్తుత 17వ సీజన్లో చూడలేం. ఇందులో ఒకరిని కెప్టెన్ నుంచి యాజమాన్యం తొలగించింది. మరొకరు కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. దీంతో ఆ ఇద్దరి క్రీడాకారుల అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోని
చెన్నై జట్టును అత్యంత విజయవంతమైన టీం గా రూపొందించడంలో ధోని పాత్ర కీలకమైనది. ఏకంగా ఆ జట్టును ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా ధోని నిలబెట్టాడు. గత ఏడాది గుజరాత్ జట్టుపై జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలవడం ద్వారా చెన్నై జట్టు ఐదవ సారి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. గత ఏడాది ఐపీఎల్ లో అద్భుతమైన ఎత్తులు వేసి ప్రత్యర్థి జట్లను తుత్తునియలు చేశాడు. ఏకంగా ఫైనల్ లాగా తీసుకెళ్లాడు. విజేతగా నిలిపాడు. గత ఏడాది విజయంతో ముంబై జట్టు సరసన చెన్నై నిలిచింది. అత్యధిక ట్రోఫీలు గెలిచిన రెండవ జట్టుగా ఆవిర్భవించింది. అయితే ఈ ఏడాది కూడా ధోనినే కెప్టెన్ గా ఉంటాడని.. ఈ సీజన్ తో ఐపీఎల్ కు ధోని గుడ్ బై చెప్తాడని ప్రచారం జరిగింది. అయితే ఆకస్మాత్తుగా ధోని శుక్రవారం బెంగళూరు జట్టుతో మ్యాచ్ మొదలవుతుందనగా.. చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ధోని నిర్ణయం నేపథ్యంలో కొత్త కెప్టెన్ గా రుతు రాజ్ గైక్వాడ్ ను చెన్నై జట్టు యాజమాన్యం నియమించింది. ధోని నిర్ణయం నేపథ్యంలో అభిమానులు ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయారు. “We miss your captaincy” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
రోహిత్ శర్మ
మహేంద్ర సింగ్ ధోని కంటే ముందు ముంబై జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. దూకుడయిన బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్టును వణికించే సత్తా రోహిత్ శర్మది. అయితే గత రెండు సీజన్లో ముంబై జట్టు ఆశించినంత స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సీజన్లో కెప్టెన్సీ ని మార్చింది. రోహిత్ శర్మ బదులుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ఎక్స్ చేంజ్ ద్వారా ముంబై జట్టులోకి తీసుకుంది. సహజంగానే ఈ పరిణామం రోహిత్ శర్మకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఒకానొక దశలో రోహిత్ శర్మ ఐపిఎల్ ఆడబోవనని ప్రకటించాడు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం పట్ల రోహిత్ శర్మ సతీమణి సామాజిక మాధ్యమాల వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్తకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందింది. కొంతమంది క్రీడాకారులు కూడా రోహిత్ శర్మకు అండగా నిలబడ్డారు. అయినప్పటికీ ముంబై జట్టు యాజమాన్యం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. పైగా ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా నవ్వుతూ పలకరించుకున్నారు. ఒకరితో ఒకరు సరదాగా సంభాషించుకున్నారు. కడుపులో బాధ ఉన్నప్పటికీ రోహిత్ శర్మ జట్టు కోసం ఆడాలనే కసి తో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
అటు ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం.. రోహిత్ శర్మ కెప్టెన్ పదవిపోవడంతో.. ఈ ఇద్దరి దిగ్గజ ఆటగాళ్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్లో వీరి నాయకత్వాన్ని మిస్ అవుతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొత్త వారి నాయకత్వంలో.. బలమైన జట్లుగా పేరుపొందిన చెన్నై, ముంబై ఈ సీజన్లో ఎలాంటి ఆట తీరు ప్రదర్శిస్తాయో వేచి చూడాల్సి ఉంది.