DC Vs SRH 2024: క్రికెట్ బ్యాటర్ల గేమ్ అయిపోయింది.. మీరు మాత్రం హెల్మెట్లు పెట్టుకోండి భయ్యా..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు బ్యాటర్లు విధ్వంసానికి దిగితే.. బంతులు బౌండరీల బయటపడితే.. వాటిని అందించేందుకు బాల్ బాయ్స్ అందుబాటులో ఉంటారు. అయితే క్రికెట్ చరిత్రలో ఇంతవరకు బాల్ బాయ్స్ హెల్మెట్ ధరించిన దాఖలాలు లేవు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 21, 2024 7:57 am

DC Vs SRH 2024

Follow us on

DC Vs SRH 2024: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. బౌండరీ ల వర్షం కురిసింది. సిక్సర్ల హోరు వినిపించింది. అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో రెండు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు సునామీలాంటి బ్యాటింగ్ తో అదరగొట్టారు. మొత్తంగా ఈ మ్యాచ్లో 71 బౌండరీలను బ్యాటర్లు కొట్టారు. అయితే ఇందులో 40 ఫోర్లు, 31 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఈ స్థాయిలో బౌండరీలు నమోదు కావడం ఇది రెండవసారి. ఈ సీజన్లో హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో 81 బౌండరీలను బ్యాటర్లు కొట్టేశారు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇదే అరుదైన రికార్డుగా కొనసాగుతోంది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు బ్యాటర్లు విధ్వంసానికి దిగితే.. బంతులు బౌండరీల బయటపడితే.. వాటిని అందించేందుకు బాల్ బాయ్స్ అందుబాటులో ఉంటారు. అయితే క్రికెట్ చరిత్రలో ఇంతవరకు బాల్ బాయ్స్ హెల్మెట్ ధరించిన దాఖలాలు లేవు. కానీ, తొలిసారిగా ఢిల్లీ, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బాల్ బాయ్స్ హెల్మెట్లు ధరించారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ బాయ్స్ హెల్మెట్లు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ అయితే తెగ కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ మొత్తం బ్యాటర్ల గేమ్ గా మారిపోయిందని.. బాల్ బాయ్స్ హెల్మెట్లు పెట్టుకుని తలలు కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారు.

ఇక శనివారం రాత్రి హైదరాబాద్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో.. హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 266 రన్స్ చేసింది. హైదరాబాద్ ఆటగాడు హెడ్ 33 బంతుల్లో 89, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46, షాబాద్ అహ్మద్ 29 బంతుల్లో 59* తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగడంతో హైదరాబాద్ స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఢిల్లీ బౌలర్లలో కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో ఢిల్లీ 199 పరుగులకు ఆల్ అవుట్ అయింది. జేక్ ఫ్రేజర్ 18 బంతుల్లో 65, అభిషేక్ పోరల్ 22 బంతుల్లో 42, కెప్టెన్ రిషబ్ పంత్ 35 బంతుల్లో 44 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. మయాంక మార్కండే 2, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.