Sunrisers Hyderabad: క్లాసెన్ దంచి కొడుతున్నాడు..హెడ్ అరి వీర భయంకరంగా ఆడుతున్నాడు.. అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. ప్యాట్ కమిన్స్ కీలక సమయంలో వికెట్లు పడగొడుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ అదును చూసి దెబ్బ కొడుతున్నాడు. ఫలితంగా హైదరాబాద్ వరుస విజయాలు సాధిస్తోంది. అంతేకాదు ఈ ఐపీఎల్లో ముంబై పై 277, బెంగళూరు పై 287 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. బహుశా ఇప్పట్లో ఐపీఎల్లో మరే జట్టూ ఈ ఘనతను అందుకోకపోవచ్చు. వాస్తవానికి గత కొన్ని సీజన్లో హైదరాబాద్ జట్టు ఆటతీరు ఏమంత గొప్పగా లేదు. చివరి స్థానాల్లో పోటీపడుతూ.. వరుస పరాజయాలతో పరువు పోగొట్టుకునేది. జట్టు ఆట తీరు చూసి కావ్య మారన్ కన్నీరు పెట్టుకునేది. కానీ ఈ సీజన్లో ఊహించని స్థాయిలో హైదరాబాద్ జట్టు ఆడుతోంది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో నాలుగవ స్థానంలో ఉన్నప్పటికీ.. ఆ జట్టు ఆట తీరు చూస్తుంటే ప్లే ఆఫ్ వెళ్లి కప్ కొట్టేలా కనిపిస్తోంది. ఇది హైదరాబాద్ అభిమానులకు సంతోషం కలిగించే వార్తే అయినప్పటికీ.. అసలు ఆ జట్టు ఆటతీరు ఇంతలా ఎలా మారిందనేది సగటు ప్రేక్షకుడి మదిలో మెదలుతున్న ఓ సందేహం.
హైదరాబాద్ జట్టు సాధిస్తున్న విజయాల వెనుక చాలామంది కావ్య మారన్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్ ఉన్నారని అనుకుంటున్నారు. బహుశా ఉండి ఉండవచ్చు కూడా. కానీ, ఆ జట్టుకు కర్త, కర్మ, క్రియ లాగా పనిచేస్తున్న ఒక కోచ్ ఉన్నాడు. గతంలో న్యూజిలాండ్ జట్టుకు అప్రతిహత విజయాలు అందించిన అతడు.. ఇప్పుడు కోచ్ అవతారం ఎత్తి హైదరాబాద్ జట్టును గాడిలో పెట్టాడు. ఎంతలా అంటే గత సీజన్లలో ఆడింది ఈ జట్టేనా అనే అనుమానం కలిగేలా.. ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచ్ లాడింది. అందులో నాలుగు విజయాలు దక్కించుకుంది. కేవలం పది రోజుల వ్యవధిలో రెండుసార్లు 270+ స్కోర్లు సాధించింది. చెన్నై , ముంబై, బెంగళూరు వంటి టాప్ జట్లను ఓడించింది. ఈ వరుస విజయాల వెనుక ఉన్నది ఒకే ఒక్కడు.. అతడే డానియల్ వెటోరి. ఈ సీజన్లో హైదరాబాద్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన ఈ కివీస్ లెజెండ్.. టోర్నీ ప్రారంభానికి ముందే పకడ్బందీ వ్యూహాలతో సిద్ధమై వచ్చాడు. కావ్య తో చర్చించి ట్రావిస్ హెడ్, కమిన్స్ ను జట్టులోకి తీసుకొచ్చాడు. కమిన్స్ కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టించాడు. అభిషేక్ శర్మ సత్తా తెలిసి అతడిని ఓపెనర్ గా పంపించాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ లోకి వచ్చే క్లాసెన్ ను టాప్ ఆర్డర్లో ఆడిస్తున్నాడు. అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లకు విస్తృతంగా అవకాశాలు ఇస్తున్నాడు. వారి దగ్గర నుంచి గట్టి ఫలితాలు రాబడుతున్నాడు.
మూస ధోరణిలో కాకుండా బ్యాటింగ్ లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాడు వెటోరి. కెప్టెన్, ఓనర్ కావ్యతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాడు. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ కు వెళ్తే బాగుంటుంది? ఎప్పుడు బౌలింగ్ చేస్తే బాగుంటుంది? అనే అంశాలపై సుదీర్ఘంగా మదనం చేస్తూ వాటిని అమల్లో పెడుతున్నాడు. టీం కాంబినేషన్ ను పకడ్బందీగా సెట్ చేస్తూ.. మొదటి బంతి నుంచే అటాకింగ్ అప్రోచ్ తో ఆడేలా ఆటగాళ్లకు నూరిపోస్తున్నాడు. బౌలింగ్ లో కేవలం కమిన్స్ మీదే ఆధారపడకుండా.. రకరకాల ఆప్షన్స్ ను అందుబాటులో ఉంచాడు. మయాంక్ మార్కండే ఇటీవల మ్యాచుల్లో విఫలమయ్యాడు. అయినప్పటికీ అతడికి వెటోరి అవకాశాలు ఇస్తున్నాడు. అందువల్లే బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదర్ వికెట్లను పడగొట్టాడు.
వాస్తవానికి వెటోరి బెంగళూరు జట్టుకు నాలుగు సంవత్సరాల పాటు కోచ్ గా పనిచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో ఎలాంటి ఆటగాళ్లు అవసరం? ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ఏ ఆటగాడిని ఎప్పుడు ఆడించాలి? వంటి అంశాలపై అతడికి పూర్తిగా అవగాహన ఉంది. ప్రత్యర్థి జట్లు ఆడే విధానం, ఆటగాళ్ల ప్రదర్శన వంటి వాటిపై వెటోరీకి ఒక స్పష్టత ఉంది. అందువల్లే హైదరాబాద్ జట్టుకు కావలసిన ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. నిశ్శబ్దంగా వాటిని అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు.. అందుకే హైదరాబాద్ విజయాల వెనుక అందరూ అనుకుంటున్నట్టు ఆటగాళ్లు మాత్రమే కాదు. వారిని నడిపిస్తున్న అదృశ్య శక్తి కోచ్ వెటోరీనే.. అతడి ప్రణాళికలే ఇప్పుడు సన్ రైజర్స్ విజయాల బాట పట్టడానికి కారణంగా చెప్పొచ్చు.