CSK Vs KKR IPL 2024: వరుసగా మూడు మ్యాచ్ లు.. అన్నింట్లోనూ విజయం.. సిసలైన దూకుడు.. అసలైన ఆట తీరు.. బౌలర్లు బుల్లెట్ లాంటి బంతులు సంధిస్తే.. బ్యాటర్లు మెరుపు వేగంతో పరుగులు.. మైదానంలో చురుకుగా ఫీల్డర్లు.. ఇలా సమష్టిగా ఆడుతున్నారు కాబట్టే కోల్ కతా ఆటగాళ్లు.. తమ జట్టుకు అప్రతిహత విజయాలు అందించారు. సోమవారం నాటి చెన్నైతో జరిగిన మ్యాచ్ లోనూ కోల్ కతా నే ఫేవరెట్.. కానీ రుత్ రాజ్ సేన కోల్ కతా ను నేలకు దించింది. తోపు, తురుం అని పేరుపొందిన టీం ను కకావికలం చేసింది. వరుస వైఫల్యాల తర్వాత చెన్నై జట్టు డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడింది. కోల్ కతా పై గెలిచి సక్సెస్ ట్రాక్ ఎక్కింది.. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో సమష్టిగా రాణించి ఏడు వికెట్ల తేడాతో కోల్ కతా పై చెన్నై జట్టు విజయం సాధించింది.
రవీంద్ర జడేజా బౌలింగ్ ముందు.. వ్యూహాలు తేలిపోయాయి
ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్ రవీంద్ర జడేజా తొలిసారి నిప్పులు చెరిగాడు. కీలకమైన ఆటగాళ్ళను పెవిలియన్ పంపించి చెన్నై జట్టుకు మ్యాచ్ పై ఆధిక్యాన్ని అందించాడు. రవీంద్ర జడేజా వల్ల కోల్ కతా మెంటార్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు మొత్తం గుడ్డ పీలికలయ్యాయి. భారీ అంచనాలు పెట్టుకుంటే ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో గౌతమ్ గంభీర్ ముఖం మాడిపోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసి..
ఈ మ్యాచ్ లో ముందుగా కోల్ కతా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు ఆశించినంత స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా చెన్నై బౌలింగ్ ను తట్టుకోలేక ఇబ్బంది పడ్డారు.. పేరుపొందిన ఆటగాళ్లు సైతం పరుగులు చేయలేక ఆపసోపాలు పడ్డారు. కోల్ కతా ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో మూడు ఫోర్లతో 34), సునీల్ నరైన్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 27) అంగ్ క్రీష్ రఘువన్షీ(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ తో 24) ఉన్నంతలో రాణించారు.
స్వల్ప లక్ష్యం కావడంతో..
లక్ష్యం స్వల్పం కావడంతో చెన్నై జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి సునాయాస గెలుపును దక్కించుకుంది. కెప్టెన్ రుత్ రాజ్ గైక్వాడ్(58 బంతుల్లో 9 ఫోర్లతో 67*) హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. డారెల్ మిచెల్(25), శివమ్ దూబె(28) అదరగొట్టారు.
ఐదేళ్ల తర్వాత
ఈ మ్యాచ్ లో ఆఫ్ ది ఆర్డర్ లో రుత్ రాజ్ గైక్వాడ్ ఐదు సంవత్సరాల తర్వాత తొలి ఆఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో ధోని(1*) తో కలిసి గెలుపు లాంచనాన్ని పూర్తి చేశాడు. కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
అన్ని రంగాల్లో విఫలమైంది
దూకుడైన ఆటతీరుతో ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కోల్ కతా జట్టు.. ఈ మ్యాచ్ లో అని రంగాల్లో విఫలమైంది. బ్యాటింగ్ కు ప్రతికూలంగా ఉన్న వికెట్ పై కోల్ కతా హిట్టర్లు చేతులెత్తేశారు. ఈ మ్యాచ్లో కోల్ కతా మెంటార్ గౌతమ్ గంభీర్ అనుకూల్ రాయ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఫలితాన్ని ఇవ్వక పోయింది.. అంతేకాకుండా టర్నింగ్ ట్రాక్ పై చెన్నై జట్టు బౌలర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొడితే..కోల్ కతా స్పిన్నర్లు తేలిపోయారు. సునీల్ నరైన్ ఒక్కడే ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు.