CSK Vs GT 2023 Qualifier 1: ఏయ్ బిడ్డా.. ఇది ధోనీ అడ్డా.. పదో సారీ పాత బోతున్నాడు జెండా

టాస్ ఓడినప్పటికీ బౌలింగ్ ఎంచుకోవడం గుజరాత్ జట్టుకు ప్రతిబంధకంగా పరిణమించింది. గుజరాత్ నిర్ణయంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టుకు ఎప్పటిలాగే శుభారంభం దక్కింది.

Written By: Bhaskar, Updated On : May 24, 2023 8:33 am

CSK Vs GT 2023 Qualifier 1

Follow us on

CSK Vs GT 2023 Qualifier 1: “పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే” అతడు సినిమాలో మహేష్ బాబు పాత్రను ఉద్దేశించి ఓ పాట సాగుతుంది గుర్తుంది కదా! సేమ్ ఈ పాటను ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనికి కూడా అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఏకంగా పదో సారి తన జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడమే కాకుండా, ఐపీఎల్ లో తన రిటైర్మెంట్ కు ఘనమైన వీడ్కోలు లభించేలా ధోని చేసుకున్న ఏర్పాట్లను చూస్తుంటే “వాహ్ వా ఎంఎస్” అనకుండా ఉండలేం. ఇక మంగళవారం సొంత గడ్డపై తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు పై చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించిన విధానం న భూతో న భవిష్యత్. లక్ష్య చేదనలో గుజరాత్ జట్టుకు తిరుగులేని రికార్డు ఉన్నప్పటికీ పరిస్థితులు ఎందుకో అనుకూలించలేదు. పైగా మంచు ప్రభావం లేకపోవడంతో బౌలర్లదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయిన టైటాన్స్ శుక్రవారం జరిగే రెండో క్వాలిఫైయర్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ ఫోర్ విజేతతో ఆరోజు తలపడుతుంది.

172 పరుగులు చేసింది

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది..రుతు రాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 60), కాన్వే (34 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 40), జడేజా (16 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 22) పరుగులు చేశారు. వీళ్ళ బ్యాటింగ్ ధాటికి చెన్నై 172 పరుగులు చేసింది. ఇక గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ చెరో రెండు వికెట్లు తీశారు.

గుజరాత్ 157

లక్ష్య చేదనలో గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 157 పరుగులకు ఆల్ అవుట్ అయింది. గిల్(38 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 42), రషీద్ ఖాన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 30) మెరిశారు. దీపక్ చాహర్, తీక్షణ, జడేజా, పథిరనకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రుతు రాజ్ నిలిచాడు.

మైదానం స్లోగా ఉండడం, బంతి చక్కగా మెలికలు తిరగడం, మంచు ప్రభావం కూడా ఉండడంతో గుజరాత్ జట్టుకు 173 పరుగుల లక్ష్యం చాలా కష్టంగా అనిపించింది. ఓపెనర్ గిల్ క్రీజు లో చాలాసేపు ఓపికగా ఉన్నప్పటికీ, తన సహజ శైలిలో హాడలేకపోయాడు. పవర్ ప్లే లో సాహా(12), హార్దిక్ (8) ఔట్ అయ్యారు. షనక(17) పర్వాలేదు అనుకున్నప్పటికీ జడేజా అతడితోపాటు తన తర్వాతే ఓవర్ లోనే మిల్లర్ (4) కళ్ళు చెదిరే బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 14వ ఓవర్ తొలి బంతికే గిల్ ను చాహర్ అవుట్ చేయగా… తెవాటియా (3) స్వల్ప స్కోర్ కే వెను దిరిగాడు. కానీ క్రీజు లో ఉన్న విజయ్ శంకర్ (14), రషీద్ భారీ షాట్లతో చెలరేగారు. 16వ ఓవర్ లో రషీద్ 6,4 తో 13 రన్స్, 17వ ఓవర్ లో రషీద్ 6,4, శంకర్ 6 తో 13 రన్స్ చేయడంతో చెన్నై శిబిరంలో ఆందోళన కల్పించింది. ఇక మూడు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన వేళ.. శంకర్ అవుట్ అయినప్పటికీ రషీద్ బౌండరీలతో అదరగొట్టాడు. ఎట్టకేలకు అతడిని 19వ ఓవర్లో దేష్ పాండే అవుట్ చేయడంతో చెన్నై జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

టాస్ ఓడినప్పటికీ బౌలింగ్ ఎంచుకోవడం గుజరాత్ జట్టుకు ప్రతిబంధకంగా పరిణమించింది. గుజరాత్ నిర్ణయంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టుకు ఎప్పటిలాగే శుభారంభం దక్కింది. అయితే మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు స్కోరు కొంచెం నెమ్మదించింది. అయితే చివరిలో విలువైన పరుగులు జోడించడంతో ప్రత్యర్థి జట్టుకు సవాల్ విసిరే స్కోరు సాధించింది. చెన్నై జట్టులో ఓపెనర్ కాన్వే మునుపటి దూకుడు ప్రదర్శించలేకపోయినప్పటికీ.. అతడి సహచరుడు రుతు రాజ్ మాత్రం చెలరేగి ఆడాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో అతడు కొట్టిన బంతి గాలిలో ఎగిరడంతో గుజరాత్ జట్టు ఫీల్డర్ దానిని ఒడుపుగా పట్టాడు. అయితే అది నోబ్ బాల్ గా తేలడంతో బతికిపోయాడు. అయితే అదే ఓవర్లో గైక్వాడ్ 14 పరుగులు పిండుకున్నాడు. కాన్వే నిదానంగా ఆడటం వల్ల చెన్నై జట్టు తొలి పవర్ ప్లే లో 49 పరుగులు మాత్రమే చేసింది. అయితే 36 బంతుల్లో 50 పరుగులు చేసిన గైక్వాడ్ గుజరాత్ జట్టుపై ఆడిన.. ప్రతి మ్యాచ్ లోనూ అర్థ సెంచరీలు చేయడం విశేషం. అయితే గైక్వాడ్ ను మోహిత్ 11 ఓవర్ లో అవుట్ చేయడంతో చెన్నై వికెట్ల పతనం ప్రారంభమైంది. స్పిన్నర్ లపై ఎదురు దాడి చేసేందుకు రంగంలోకి దిగిన శివం దూబే(1) ను మరుసటి ఓవర్లో నూర్ అహ్మద్ ఔట్ చేశాడు. ఇక సిక్స్ కొట్టి ఊపు మీద ఉన్న రహానే (17), బ్యాటింగ్ స్వేచ్ఛగా చేయలేక ఇబ్బంది పడుతున్న కాన్వే కూడా వరుస ఓవర్లలో వెనుతిరిగారు. 17వ ఓవర్ లో మోహిత్ ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత రాయుడు (17), ధోని(1) వెనుతిరి గారు. ఆఖరి ఓవర్ లో జడేజా 4, మొయిన్ అలీ సిక్స్ కొట్టారు. మొత్తంగా 15 పిండుకున్నారు. దీంతో చెన్నై స్కోరు 170 దాటింది.

ధోని మాస్టర్ బ్రెయిన్

ఇక లక్ష్య చేదనకు దిగిన గుజరాత్ జట్టును ధోని తన మాస్టర్ బ్రెయిన్ తో ముప్పు తిప్పలు పెట్టాడు. ఒకానొక దశలో టార్గెట్ చేజ్ చేసేలాగా గుజరాత్ జట్టు కనిపించింది. కానీ ధోని తన తెలివితేటలతో బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించడంతో గుజరాత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది.. ఫలితంగా చెన్నై జట్టు విజయం సాధించింది. ధోని ప్రణాళికలు విజయవంతం కావడంతో సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తిపోతున్నాయి. “ఏయ్ బిడ్డా…ఇది ధోని అడ్డా.. పాతాడు పసుపు జెండా” అని అర్థం వచ్చేలా కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.