Hardik Pandya : నాయకుడంటే జట్టును నడిపించాలి. ఆటగాళ్లలో సమన్వయం పెంపొందించాలి. అవసరమైతే జట్టు భారాన్ని ఒక్కడే మోయాలి. అప్పుడే అతడు నాయకుడిగా మన్ననలు అందుకుంటాడు. కానీ, ఈ లక్షణాలకు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరంగా ఉంటున్నాడు. అసలు అతడు జట్టుకు కెప్టెన్ కావడమే వివాదానికి కారణమైంది. అతని ఆట తీరు, మైదానంలో వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాస్పదమయ్యాయి. ఇక సోషల్ మీడియాలో అయితే హార్దిక్ పాండ్యా పై స్ప్రెడ్ అయిన నెగెటివిటీ అంతా ఇంతా కాదు. ఇంత జరుగుతున్నా హార్దిక్ మారలేదు. మారతాడనే ఆశ కూడా లేదు. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా తోటి ఆటగాళ్లపై అరిచాడు. తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆటగాళ్లను ఒక రకంగా చూశాడు. ఇలాంటి వ్యక్తి నాయకత్వంలో ముంబై జట్టు ఎదుగుతుందని ముఖేష్ అంబానీ ఎలా భావించాడో ఆయనకే తెలియాలి..
వాస్తవానికి ఈ సీజన్లో ముంబై జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఆ జట్టు మిగతా జట్ల కంటే బలంగా ఉంది. కానీ, ఆ జట్టుకు సరైన నాయకుడు లేకపోవడంతోనే ఈ స్థాయిలో ఓటములు ఎదుర్కొంటోంది. గత సీజన్లో, అంతకుముందు సీజన్లో హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టుకు నాయకత్వం వహించాడు. 2022 సీజన్లో గుజరాత్ జట్టును విజేతగా నిలిపాడు. గత సీజన్లో రన్నరప్ గా ఉంచాడు. అయితే ఆ స్థాయిలో ప్రస్తుతం నాయకత్వం వహించలేకపోతున్నాడు. ఉన్న వనరులను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నా. అద్భుతంగా బౌలింగ్ వేసే బుమ్రాను దూరం పెడుతున్నాడు. అతడు రోహిత్ శర్మకు దగ్గరనే ఉద్దేశంతోనే ఎప్పటికో గాని బౌలింగ్ ఇవ్వడం లేదు. పైగా అతడు ముందుగా బౌలింగ్ చేస్తూ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగం లోనూ హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో 46 పరుగులు చేశాడు.. దానికంటే ముందు జరిగిన మ్యాచ్లలో అతడు పెద్దగా బ్యాటింగ్ చేసిన దాఖలాలు లేవు.
ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై పది పరుగుల తేడాతో ఓడిపోయింది. వాస్తవానికి కీలకమైన ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో ముంబై జట్టు బ్యాటింగ్ భారాన్ని తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మోశాడు. అతడు 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతడు గనుక నిలబడకపోయి ఉండి ఉంటే ముంబై జట్టు మరింత దారుణంగా ఓడిపోయేది. అయితే తిలక్ వర్మ ఆ స్థాయిలో ఆడినప్పటికీ హార్దిక్ పాండ్యా నోరు పారేసుకున్నాడు. కేవలం తిలక్ వర్మ వల్లనే జట్టు ఓడిపోయిందన్నట్టుగా తలా తోకా లేని వ్యాఖ్యలు చేశాడు. మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ ఇంకా దాటిగా ఆడి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. అక్షర్ పటేల్ తిలక్ వర్మ ను కట్టడి చేశాడని వ్యాఖ్యానించాడు. వాస్తవానికి తిలక్ వర్మ అనామక ఆటగాడు కాదు.. అక్షర్ పటేల్ వైవిధ్యంగా బంతులు వేస్తున్నప్పటికీ.. ధాటిగా ఎదుర్కొన్నాడు. సునాయాసంగా పరుగులు చేశాడు. కానీ, ఈ విషయాన్ని పక్కదారి పట్టించి, తిలక్ వర్మ రోహిత్ శర్మకు అనుకూలంగా ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో హార్దిక్ పాండ్యా చవకబారు విమర్శలు చేశాడు. హార్దిక్ పాండ్యా వ్యవహార శైలి పట్ల సొంత జట్టు ఆటగాళ్ళే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఏ జట్టు కెప్టెన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని వారు గుర్తు చేస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తి జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడని, ఎలాంటి నమ్మకంతో అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారని సీనియర్ ఆటగాళ్లు ముఖేష్ అంబానీని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో ఉన్న ముంబై జట్టు.. ప్లే ఆఫ్ ఆశలను ఎప్పుడో వదిలేసుకుంది. కనీసం వ్యవహార శైలితోనైనా అభిమానుల మనసు గెలుచుకుంటారంటే.. హార్దిక్ పాండ్యా వల్ల అది కూడా ముంబై జట్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Criticism of hardik pandyas captaincy after tilak vermas batting mistake
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com