Cricket : డబ్బు.. ఆ డబ్బుంటేనే ఈ సమాజం గౌరవిస్తుంది. ఆ డబ్బుతోనే హోదా వస్తుంది. ఆ డబ్బు వల్లే దర్పం లభిస్తుంది. డబ్బే లేకుంటే ఎవరూ దేకరు. కనీసం పట్టించుకోరు. ఆ క్రికెటర్ కు కూడా డబ్బు మీద ఇలాంటి అభిప్రాయమే ఉంది కాబోలు. అందుకే డబ్బు కోసం ఏకంగా పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది.
దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్.. అతడికి దక్షిణాఫ్రికా జట్టులో అద్భుతమైన ఆటగాడిగా పేరుంది. ఇతడు ఐపిఎల్ లో గుజరాత్ జట్టుకు ఆడుతున్నాడు.. ఇటీవల ఇతడికి బంపర్ ఆఫర్ లభించింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఫార్చ్యూన్ బారిషల్ జట్టు తరఫున మూడు మ్యాచ్ లు ఆడితే ఏకంగా 1.5 కోట్లు చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. దీనికి రెండవ మాటకు తావు లేకుండా మిల్లర్ ఓకే చెప్పాడు. అంతేకాదు మూడు మ్యాచ్ లు ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పాడు. తన ప్రేయసితో పెళ్లిని వాయిదా వేసుకుని ఫిబ్రవరి 26న ఎలిమినేటర్, ఫిబ్రవరి 28న క్వాలిఫైయర్ 2, మార్చి 1న ఫైనల్ మ్యాచ్లో ఫార్చ్యునర్ బరిషల్ జట్టు తరఫున ఆడాడు. అయితే బిపిఎల్ 2024 విజేతగా బరిషల్ జట్టు నిలవడం విశేషం.
దీనికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ తెలిపాడు. “నేను పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లలో ఉన్నాను. అందువల్లే బిపిఎల్ ను అనుసరించలేకపోయాను. అయినప్పటికీ ఏడాది విజేత ఎవరో తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. డేవిడ్ మిల్లర్ కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు బరిషల్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. దీంతో అతడు తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడని” అక్రమ్ వివరించాడు.
డేవిడ్ మిల్లర్ వివాహం వాస్తవానికి ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. అయితే దాన్ని వాయిదా వేసుకున్న మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత తన ప్రేయసి కామిల్లా హరీస్ ను మార్చి పదిన వివాహం చేసుకున్నాడు.. కాగా, వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. దీనిపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.. డబ్బు విలువ తెలిసింది కాబట్టే మిల్లర్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడని, చేతినిండా డబ్బు పడ్డాక పెళ్లి చేసుకున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు.