Asia Cup India Vs Pakistan: ఇటీవల లెజెండ్స్ క్రికెట్ టోర్నీ జరిగినప్పుడు పాకిస్తాన్ తో భారత్ తలపడాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భారత లెజెండరీ ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుతో ఆడేందుకు ఇష్టపడలేదు. లీగ్ దశలో పాకిస్తాన్ జట్టుతో భారత్ ఆడలేదు. ఆ తర్వాత సెమీఫైనల్ లో పాకిస్తాన్ తో ఆడాల్సి ఉన్నప్పటికీ.. భారత్ ఇష్టపడలేదు. దీంతో నిబంధనల ప్రకారం టోర్నీ నుంచి భారత జట్టు నిష్క్రమించాల్సి వచ్చింది.
Also Read: అయ్యర్ కోసం రంగంలోకి ప్రీతిజింటా.. బీసీసీఐ తో ఢీ!
భారత జట్టు ట్రోఫీని కోల్పోయినప్పటికీ.. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తాము ఆడ లేమని.. తమ దేశ ప్రజల భద్రతే తమకు ముఖ్యమని భారత లెజెండరీ ఆటగాళ్లు స్పష్టం చేశారు. అప్పట్లో భారత ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల దేశ మొత్తం హర్షం వ్యక్తం అయింది. అయితే ఇప్పుడు భారత జాతీయ క్రికెట్ జట్టు వ్యవహరిస్తున్న తీరు పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహార శైలి పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
త్వరలో ఆసియా కప్ నిర్వహించనున్నారు. టి20 విధానంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఇటీవల ఆపరేషన్ సింధూరం జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ ఇతర క్రీడల్లో ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ లు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రకారం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ లో .. పాకిస్తాన్ ఆటగాళ్లు భారతదేశంలో ఆడే అవకాశం లేదు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో రెండు దేశాలు న్యూట్రల్ వేదికలలో మాత్రమే తలపడతాయి. అయితే ఆసియా కప్ ను దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇది రెండు దేశాలకు న్యూట్రల్ వేదిక కావడంతో ఆ మ్యాచ్ అక్కడ జరుగుతుందని తెలుస్తోంది.
ఇటీవల లెజెండరీ ఆటగాళ్ల టోర్నీ ఇంగ్లాండ్ వేదికగా జరిగింది. అయినప్పటికీ భారత లెజెండరీ ఆటగాళ్లు ఇంగ్లాండులో ఆడుతున్నప్పటికీ పాకిస్తాన్ తో తల పడటాన్ని ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు భారత జాతీయ జట్టు కూడా పాకిస్తాన్ జట్టుతో ఆడకూడదని.. ఆడాల్సిన అవసరం లేదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అదే విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మరి దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడుతుందని స్పష్టం చేసింది. బీసీసీఐ ఆ నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. మరి దీనిపై బోర్డు పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు కేంద్ర క్రీడల శాఖ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందని స్పష్టత ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.