Gautam Gambhir strategy: ఏ క్రీడ అయినా సరే.. ఆ క్రీడల్లో ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే కోచ్ ఎవరైనా సరే.. జట్టు విజయాన్ని లక్ష్యంగా చేసుకొని శిక్షణ ఇస్తుంటారు. జట్టు ఎలాగైనా గెలవాలని రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంటారు. వ్యూహాలు కాస్త కఠినంగా అమలు చేస్తుంటారు. ఎందుకంటే శిక్షకుడా అనేవాడు ఉదాసీనంగా ఉంటే విజయాలు అంత ఈజీగా రావు. ముఖ్యంగా క్రికెట్లో అయితే అంత సులువుగా రావు. మన దేశ క్రికెట్ కు సంబంధించి.. ముఖ్యంగా పురుషులకు సంబంధించిన క్రికెట్ విషయంలో మొదటి నుంచి కూడా మేనేజ్మెంట్ కఠినంగానే ఉంటున్నది. శిక్షకులు కూడా అదే స్థాయిలో ఉండడంతో జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. అందువల్లే ప్రపంచ క్రికెట్లో వన్డే, టి20 విభాగాలలో టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది.
ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో టీమిండియా ఓటమిపాలైంది. మొదటి వన్డేలో దారుణంగా ఆడి ఓడిపోయింది. రెండవ వన్డే లో కూడా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగించింది. దీంతో ఆతిథ్య జట్టు ఎదుట చేతులెత్తేసింది. మూడో వన్డేలో మాత్రం అదరగొట్టింది. తద్వారా ఓటమి అంతరాన్ని 2-1 కు తగ్గించింది. ఇక ఇప్పుడు అదే ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా టి20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా దారుణంగా ఆడింది. ఈ ఓటమికి ఆటగాళ్ల కంటే మేనేజ్మెంట్ చేసిన ప్రయోగాలు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా ప్రవర్తించింది. బౌలింగ్ విషయంలో కూడా మేనేజ్మెంట్ రకరకాల ప్రయోగాలు చేసింది. అర్ష్ దీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. అతడి లేని లోటు బౌలింగ్ విభాగంలో స్పష్టంగా కనిపించింది. మరోవైపు సంజు శాంసన్ కు చోటు ఇచ్చి.. వాషింగ్టన్ సుందర్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం కూడా విస్మయాన్ని కలిగించింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా క్రీడాకారుడు ఆరోన్ పించ్ ప్రముఖంగా ప్రస్తావించాడు.
రెండో టీ 20 మ్యాచ్ ముగిసిన తర్వాత తన అభిప్రాయాన్ని ఓ మీడియా ఛానల్ తో పంచుకున్నాడు. ” సింగ్ కు అవకాశం ఇస్తే బాగుండేది. అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం ఏమాత్రం బాగోలేదు. ఎక్కువ శాతం బ్యాటర్లతో వెళ్తే బౌలింగ్ విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మెల్ బోర్న్ మ్యాచ్ లో జరిగింది అదే. ఆస్ట్రేలియా ఇలాంటి జట్టుపై గెలవాలంటే ప్రయోగాలు చేయాలి. కాకపోతే అవి జట్టుకు అనుకూలంగా ఉండాలి.. రెండో టి20 మ్యాచ్లో చెప్పుకునే స్థాయిలో పరుగులను టీమ్ ఇండియా చేయలేకపోయింది.. అది చాలా ఇబ్బందికరంగా మారింది. పైగా బౌలర్లు కూడా అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. హర్షిత్, బుమ్రా పోటీపడి పరుగులు ఇచ్చారు. కులదీప్ యాదవ్ కూడా ప్రభావం చూపించలేకపోతున్నాడు. అక్షర్ అంతంతమాత్రంగానే బౌలింగ్ చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి పర్వాలేదు. జట్టులో గొప్ప గొప్ప ప్లేయర్ లో ఉన్నప్పటికీ.. గంభీర్ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావడం లేదని” పించ్ అభిప్రాయపడ్డాడు.