Srikakulam Temple Stampede: ఏపీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగి పదిమందికి పైగా చనిపోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన జరిగింది. పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఓ ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా ఒకేసారి భక్తులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పదిమందికి పైగా చనిపోయారు. నాలుగు నెలల కిందట నుంచి నూతనంగా నిర్మించిన ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి మాదిరిగా స్వామి వారి దర్శనం లభిస్తుండడంతో అందరూ చిన్న తిరుపతిగా భావించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో విశేష ప్రాచుర్యం లభించింది. అందుకే ఒకేసారి 20 వేల మందికి పైగా భక్తులు చేరేసరికి తొక్కిసలాట జరిగింది.
నాలుగేళ్ల క్రిందట సువిశాల స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించారు ఆలయ ధర్మకర్త హరి ముకుంద పండా. తనకున్న 12 ఎకరాల స్థలంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. గత మేలోనే ఆలయ ప్రారంభోత్సవం చేశారు. తిరుపతిలో స్వామివారి దర్శనం సామాన్యులకు అందని ద్రాక్షగా మిగులుతున్న తరుణంలో.. ఈ ప్రాంతీయుల కోసం ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు. అచ్చం తిరుమల మాదిరిగా ఆలయం ఉండడంతో భక్తులు విపరీతంగా తరలివచ్చారు. ఆలయం మొదటి అంతస్తులో ఉండగా.. 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రైలింగ్ ఊడిపోయింది. దీంతో ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మహిళా భక్తులు ఎక్కువగా చనిపోయారు. మొత్తం తొమ్మిది మందికి పైగా చనిపోగా.. ఐదుగురు ఆచూకీని గుర్తించగలిగారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా పలాస బయలుదేరారు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భోపాల్ పర్యటనను రద్దు చేసుకొని బయలుదేరారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి కింజరాపు అచ్చెనాయుడు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.