Vijay Hazare Trophy Ramakrishna Ghosh: దేశవాళి క్రికెట్ టోర్నీలలో విజయ్ హజారే ట్రోఫీకి విశేషమైన గుర్తింపు ఉంటుంది. ఈ టోర్నీలో ఆడి జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవాలని ప్రతి క్రికెటర్ భావిస్తుంటాడు. ప్రస్తుతం మనదేశంలో విజయ్ హజారే ట్రోఫీ జరుగుతోంది. రోహిత్ శర్మ నుంచి మొదలు పెడితే హార్దిక్ పాండ్యా వరకు పెద్ద పెద్ద ప్లేయర్లు ఈ ట్రోఫీలో ఆడుతున్నారు..
విజయ్ హజారే ట్రోఫీలో జాతీయ జట్టు ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు.. మీడియా ఫోకస్ మొత్తం వారి మీద ఉంటుంది. పైగా ఆ ఆటగాళ్లకు కోట్లల్లో అభిమానులు ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో చర్చ మొత్తం వారి చుట్టూ జరుగుతుంది. అయితే ఈసారి జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో పెద్ద పెద్ద ప్లేయర్లను కాదని.. కొంతమంది అభిమానులు రామకృష్ణ ఘోష్ అనే ఆటగాడికి విశేషమైన మద్దతు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో, మీడియాలో అతడి గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.
విజయ్ హజారే ట్రోఫీలో రామకృష్ణ మహారాష్ట్ర జట్టు తరఫున ఆడుతున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా అతడు అదరగొడుతున్నాడు. నాసిక్ ప్రాంతానికి చెందిన రామకృష్ణ తో పాటు.. ఇదే ప్రాంతానికి చెందిన సత్య జీత్ బచ్చవ్ కూడా అద్భుతమైన ఆల్ రౌండర్ గా ఎదిగాడు. రామకృష్ణ, సత్య జీత్ మహారాష్ట్ర జట్టులో కీలకమైన ఆటగాళ్లుగా ఎదిగారు.
మహారాష్ట్ర జట్టు తరుపున స్థిరమైన ఇన్నింగ్స్ ఆడుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలంలో చెన్నై జట్టు రామకృష్ణను నిలుపుకుంది. మహేంద్ర సింగ్ ధోని, గైక్వాడ్ ఇతడికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారు. రామకృష్ణ, సత్యజిత్ డిసెంబర్ 31న ఉత్తరాఖండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలగిపోయారు. వారిద్దరి దూకుడు వల్ల మహారాష్ట్ర 129 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్నిత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. కెప్టెన్ గైక్వాడ్ కూడా అదరగొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన రామకృష్ణ 31 బంతుల్లో 47, ఆరో స్థానంలో వచ్చిన సత్యజిత్ 45 బంతుల్లో 56 పరుగులు చేశారు. గైక్వాడ్, సత్యజిత్ 119 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. గైక్వాడ్, రామకృష్ణ 94 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు.
ఉత్తరాఖండ్ 332 పరుగులు చేదించే క్రమంలో రంగంలోకి దిగింది. కేవలం 202 పరుగుల వద్ద ఆగిపోయింది. సత్య జీత్ 3, రామకృష్ణ రెండు వికెట్లు పడగొట్టారు. మహారాష్ట్ర విషయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రామకృష్ణ 7 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన తొలి మహారాష్ట్ర బౌలర్ గా అవతరించాడు.