IND vs SA KL Rahul: గతంలో రోహిత్ నాయకత్వం వహించేవాడు. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. రోహిత్ తర్వాత గిల్ వచ్చాడు. అతని ఆధ్వర్యంలో కూడా ఇదే దుస్థితి. ఇప్పుడు కేఎల్ రాహుల్ చేతికి పగ్గాలు అందాయి. అతని నాయకత్వంలో కూడా మారని పరిస్థితి.. ఇలా ముగ్గురి సారధ్యంలో కూడా టీమిండియా ముఖచిత్రం ఏమాత్రం మారకపోవడం సగటు అభిమానిని తీవ్రమైన కలవరపాటుకు గురిచేస్తోంది.
గడచిన 19 మ్యాచ్ లలో టీమిండియా టాస్ ఓడిపోయింది. తాజాగా బుధవారం నాటి వన్డే మ్యాచ్లో కూడా టీమిండియా టాస్ కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. క్రితం మ్యాచ్లో కూడా దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లను టీమ్ ఇండియా బ్యాటర్లు ఊచ కోత కోశారు. ముఖ్యంగా విరాట్ సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆఫ్ సెంచరీలు చేసి దుమ్మురేపారు. టీమిండియా ఏకంగా 349 పరుగులు చేసింది. అంత స్కోర్ చేసినప్పటికీ.. భారత జట్టు ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు ఏమాత్రం భయపడలేదు. పైగా విజయం కోసం చివరి వరకు పోరాడింది.
తాజా మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోవడం పట్ల అభిమానులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఒక జట్టు మ్యాచ్ గెలవాలంటే అందులో టాస్ కీలకపాత్ర పోషిస్తుంది. పిచ్ పరిస్థితిని అంచనా వేసి కెప్టెన్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. క్రికెట్ పరిభాషలో ఒక మ్యాచ్ విజయాన్ని టాస్ అనేది దాదాపు 50% వరకు ప్రభావితం చేస్తుంది. అరుదైన సందర్భాల్లో మినహా.. మిగతా సమయాలలో టాస్ జట్టు విజయాలలో ముఖ్య భూమిక పోషిస్తుంది.
ఇక గడచిన ఐదు మ్యాచ్లలో టీమిండియా మూడు విజయాలు.. రెండు ఓటములతో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు 4 పరాజయాలు.. ఒక గెలుపుతో ఉంది. వాస్తవానికి టీమిండియా కెప్టెన్ బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గనుక గెలిస్తే కచ్చితంగా బౌలింగ్ ఎంచుకునేవాడు. ఎందుకంటే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది. కాకపోతే దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ టాస్ గెలవడంతో.. బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇదే విషయాన్ని రవి శాస్త్రి ప్రస్తావిస్తే.. డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి.. పిచ్ పరిస్థితిని అంచనావేసి బౌలింగ్ ఎంచుకున్నామని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చెప్పాడు. దీనినిబట్టి ఆ మైదానంలో ఎలాంటి వాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చేజింగ్ సమయంలో టీమిండియా బౌలింగ్ వేయడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. మంచు కురవడం వల్ల బంతి అనుకున్న స్థాయిలో తిరగడం లేదు. నేరుగా బ్యాట్ మీదకి రావడంతో క్రితం వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పండగ చేసుకున్నారు.