ICC President Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలికి అధ్యక్షుడిగా జై షా కొనసాగుతున్నారు. షా అంతకుముందు భారత క్రికెట్ నియంత్రణ మండలికి కార్యదర్శిగా కొనసాగారు.. ఒకరకంగా ప్రపంచ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలికి ప్రత్యేక స్థానం కల్పించేలా చేశారు.. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మండలికి షా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తిరుగులేదని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఎవరూ ఊహించంది జరుగుతోంది.
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు దాయాది దేశం మన జాతీయ జెండాలను ఎగరవేయలేదు. దానికంటే ముందు తను ఆక్రమించిన కాశ్మీర్లో ఐసీసీ ట్రోఫీని ప్రదర్శించాలి అనుకుంది. ఈ రెండు సందర్భాలలో అంతర్జాతీయ క్రికెట్ మండలి భారత క్రికెట్ నియంత్రణ మండలికి సహకారం అందించింది. బిసిసిఐ లేవనెత్తిన అంశాల పట్ల సానుకూలంగా స్పందించింది.. అంతేకాదు భారత్ దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడుతుందని స్పష్టం చేస్తే.. దానికి ఐసీసీ తల ఊపింది. ఆ సమయంలో భారత్ చెప్పినట్టుగానే ఐసీసీ నడుచుకుంది. దీనిపై అనేక రకాల వ్యాఖ్యలు వినిపించినప్పటికీ.. ఐసీసీ తాను చేసిన పనులను సమర్థించుకుంది. పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలికి షా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో.. భారత్ కోరినట్టుగా.. భారత్ చెప్పినట్టుగా సాగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది.
Also Read: ICC: వన్డేలలో సమూల మార్పులు.. ఐసీసీ కీలక నిర్ణయం..
ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ లార్డ్స్ లో జరుగుతోంది. అంతకుముందు సీజన్ లో తుది పోరు ఓవల్ లో జరిగింది. 2021లో డబ్ల్యూటీసీ తుది పోరు సౌతాంప్టన్ లో జరిగింది. మొత్తంగా మూడు సందర్భాలలో తుది పోరును ఇంగ్లీష్ గడ్డ మీదనే నిర్వహించారు. అయితే తదుపరి డబ్ల్యూటీసీ తుది పోరు నిర్వహించే అవకాశం తమకు ఇవ్వాలని ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అంతర్జాతీయ క్రికెట్ మండలిని కోరింది. బిసిసిఐ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఐసిసి కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఐసీసీ అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ మాత్రమే కాదు 2027, 2029, 2031 లో కూడా డబ్ల్యూటీసీ తుదిపోరు నిర్వహించే హక్కులు కూడా ఆంగ్ల జట్టు మేనేజ్మెంట్ కు ఇచ్చినట్టు ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాదు వచ్చే నెలలో సింగపూర్లో జరిగే వార్షిక సదస్సులో దీనిని అధికారికంగా ఐసిసి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంగ్ల మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. మొత్తంగా చూస్తే 2031 తర్వాతే భారత జట్టు మేనేజ్మెంట్ కు డబ్ల్యూటీసీ తుది పోరు నిర్వహించే అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ అప్పుడు కూడా ఏదైనా జట్టు మేనేజ్మెంట్ గట్టి ప్రతిపాదనలు తీసుకొస్తే బీసీసీఐ పని ఏమవుతుందనేది చూడాల్సి ఉంది.
బీసీసీఐ కి బలమైన ఆర్థిక సామర్థ్యం ఉంది. ఎలాంటి టోర్నీలైన నిర్వహించే సత్తా ఉంది.. అలాంటప్పుడు ఐసీసీ ఏకపక్షంగా ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏకధాటిగా 6 సీజన్లపాటు డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహించే అవకాశం ఆ మేనేజ్మెంట్ కు ఇవ్వడం సందేహాలకు తావిస్తోంది. మరి దీనిపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలని” మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు…