Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కు డబ్బే డబ్బు.. లంక టూర్ కు బీసీసీఐ ఎంతిస్తోందంటే..

గౌతమ్ గంభీర్ కు అన్ని విషయాలలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన బీసీసీఐ.. వేతనం విషయంలోనూ అదే స్థాయిలో ఉదారత చూపింది. పలు నివేదికల ప్రకారం గౌతమ్ గంభీర్ వార్షిక వేతనం 12 కోట్లు లభిస్తుంది. ఇతర సౌకర్యాలు కూడా బీసీసీఐ కల్పిస్తుంది. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు రోజువారీ భత్యం కింద బిసిసిఐ 21,000 చెల్లిస్తుంది. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది

Written By: Anabothula Bhaskar, Updated On : July 24, 2024 8:56 pm
Follow us on

Gautam Gambhir : రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమ్ ఇండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీం లో కీలకమైన ఆటగాడిగా గౌతమ్ గంభీర్ కొనసాగాడు. అతడికి అన్ని మెరిట్స్ ఉన్నప్పటికీ ఎందుకనో కెప్టెన్ కాలేకపోయాడు. అందువల్లే కొన్ని కొన్ని సార్లు తన అసంతృప్తిని బయటపెట్టాడు. 2012, 14 లో కోల్ కతా జట్టను రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. 2024 సీజన్లో మెంటార్ గా మారి కోల్ కతా జట్టను ముచ్చటగా మూడోసారి విజేతగా ఆవిర్భవించేలా చేశాడు. గౌతమ్ గంభీర్ లో ఆ ప్రతిభను చూసి బీసీసీఐ కోచ్ గా అవకాశం కల్పించింది. దీంతో అతడు రాహుల్ ద్రావిడ్ వారసుడిగా టీమిండియాలోకి అడుగు పెట్టాడు. టీమిండియాలోకి గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అందులో “కోల్ కతా జట్టు యజమాని షారుఖ్ ఖాన్ భారీగా ఇస్తున్నప్పటికీ గౌతమ్ గంభీర్ ఎందుకు బయటకు వచ్చినట్టు? బీసీసీఐ ఎంత జీతం ఇస్తున్నట్టు?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే వీటికి ఇప్పుడు సమాధానం లభించింది.

జాతీయ మీడియా వర్గాల ప్రకారం..

టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, జింబాబ్వే పై t20 కప్ దక్కించుకున్న తర్వాత.. టీమ్ ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఇప్పటికే భారత జట్టు లంక వెళ్లిపోయింది. మూడు టి20 లు, 3 వన్డే మ్యాచ్ లు ఆడనుంది. టి20 టోర్నీకి సూర్యకుమార్ యాదవ్, వన్డే టోర్నీకి రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తారు. రోహిత్ ఆధ్వర్యంలో ఇప్పటికే టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు. అతనితోపాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా వీడ్కోలు పలికారు. రోహిత్ వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ బాధ్యులు, గౌతమ్ గంభీర్ సూర్య కుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ కోల్ కతా జట్టుకు ఆడాడు. 2012లో కోల్ కతా జట్టు ద్వారా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్లో అద్భుతంగా పరుగులు చేసి కోల్ కతా విజేతగా ఆవిర్భవించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అప్పుడు కోల్ కతా జట్టుకు కెప్టెన్ గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. అప్పట్నుంచి సూర్య కుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ మధ్య బాండింగ్ ఏర్పడింది.. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ ను గౌతమ్ గంభీర్ కెప్టెన్ గా నియమించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నెలకు అన్ని కోట్లా?

గౌతమ్ గంభీర్ కు అన్ని విషయాలలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన బీసీసీఐ.. వేతనం విషయంలోనూ అదే స్థాయిలో ఉదారత చూపింది. పలు నివేదికల ప్రకారం గౌతమ్ గంభీర్ వార్షిక వేతనం 12 కోట్లు లభిస్తుంది. ఇతర సౌకర్యాలు కూడా బీసీసీఐ కల్పిస్తుంది. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు రోజువారీ భత్యం కింద బిసిసిఐ 21,000 చెల్లిస్తుంది. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. జూలై 27 నుంచి శ్రీలంకతో మూడు టీ 20 లు, మూడు వన్డేలు ఆడుతుంది. దాదాపు 16 రోజుల పాటు టీమ్ ఇండియా ఆటగాళ్లు శ్రీలంకలో ఉంటారు. ఆ 16 రోజులకు గానూ గౌతమ్ గంభీర్ కు 3,36,000 అదనపు భత్యంగా లభిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా గౌతమ్ గంభీర్ బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేయడం, ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసే అవకాశం వంటి సౌకర్యాలను కూడా బీసీసీఐ కల్పిస్తోంది. ఇవి మాత్రమే కాదు గంభీర్ కు నచ్చిన వారిని సహాయక సిబ్బంది గా బీసీసీఐ నియమించింది. స్థూలంగా చెప్పాలంటే ప్రస్తుతం టీమిండియాలో గంభీర్ శకం మొదలైంది.