Bavuma viral video: అతని ఎత్తు మహా అయితే నాలుగు అడుగులకు మించదు. చిన్నప్పుడు అతడిని అందరూ గేలి చేసేవారు. ఇతడు క్రికెటరా అంటూ ఎగతాళి చేసేవారు. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. విమర్శలను తనకు గెలుపు పాఠాలుగా మలచుకున్నాడు. తద్వారా దక్షిణాఫ్రికా తరఫున సరికొత్త చరిత్ర సృష్టించడానికి రెడీగా ఉన్నాడు.
డబ్ల్యూటీసీ తుది పోరులో కంగారు జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ప్రోటీస్ జట్టు ఇన్నింగ్స్ లో 138 పరుగులకే ఆల్ అవుట్ అయింది. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రోటీస్ జట్టు ఏమాత్రం ప్రతిఘటించలేకపోయింది. ఆ జట్టులో కెప్టెన్ బవుమా 36 పరుగులు చేశాడు. అతడు చేసిన ఈ పరుగులు దక్షిణాఫ్రికా జట్టు పరువును కొంతలో కొంత కాపాడాయి. ఇక రెండో ఇన్నింగ్స్ లో అయితే 27 పరుగులు చేసిన ముల్డర్ అవుట్ అయిన తర్వాత బవుమా మైదానంలోకి వచ్చాడు.. ఆచితూచి ఆడాడు. వాస్తవానికి అతడు సింగిల్ డిజిట్ స్కోర్ వద్ద అవుట్ కావాల్సి ఉండగా.. స్మిత్ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయాడు. ఇక ఆ తర్వాత ఏ అవకాశం కూడా కంగారు ప్లేయర్లకు ఇవ్వలేదు బవుమా. మూడోరోజు ఆట ముగిసిన తర్వాత అతడు 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్క్రం తో కలిసి మూడో వికెట్ కు ఇప్పటివరకు 143 పరుగులు జోడించాడు బవుమా. ప్రోటీస్ జట్టు సారధి అద్భుతంగా ఆడుతున్న నేపథ్యంలో.. అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో అతడి లో మరో కోణాన్ని కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు చూపిస్తున్నాయి.
Also Read: Temba Bavuma: వన్డే వరల్డ్ కప్ : ప్రెస్ మీట్ లో స్టేజ్ పైనే నిద్రలోకి జారుకున్న కెప్టెన్…
బవుమా తన ఎత్తు సమస్య వల్ల మొదట్లో తీవ్ర విమర్శలకు గురయ్యాడు. అసలు అతనికి జట్టులో స్థానం ఎందుకు అని చాలామంది ప్రశ్నించారు. అంతేకాదు అతడిని సారధిగా ఎంపిక చేయడం పట్ల కూడా సీనియర్ ఆటగాళ్లు విమర్శలు చేశారు. వాటన్నింటినీ అతడు తట్టుకున్నాడు. కొన్ని సందర్భాలలో జట్టు దారుణమైన వైఫల్యాలు పొందినప్పుడు వాటికి బాధ్యత వహించాడు. ఇప్పుడు తన జట్టుకు ఐసీసీ నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ట్రోఫీని అందించేందుకు తహతహలాడుతున్నాడు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో బవుమా గొప్పతనం కళ్ళకు కడుతోంది. ఎందుకంటే అతను ఆటగాడిగా మాత్రమే కాకుండా.. మానవతావాదిగా కనిపిస్తున్నాడు. వర్ధమాన ప్లేయర్లకు అతడు క్రికెట్ కిట్లు అందిస్తున్నాడు. పేద విద్యార్థులకు చదువు కొనడానికి సహాయం చేస్తున్నాడు. అంతేకాకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పిల్లలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు. ఇండియన్ ప్లేయర్లతో పోల్చి చూస్తే బవుమాకు లభించే ఆదాయం తక్కువే. అయినప్పటికీ తనకు ఉన్న దాంట్లో పేదలకు పెట్టి.. అసలు సిసలైన మానవతవాదిగా బవుమా నిలుస్తున్నాడు. ఈ కాలపు క్రికెటర్లకు ఆదర్శంగా కనిపిస్తున్నాడు. క్రికెట్ ను సంపాదనకు మార్గంగా.. మాత్రమే చూసే ఆటగాళ్లు ఉన్న ఈ కాలంలో ప్రోటీస్ కెప్టెన్ లాంటి ప్లేయర్లు కూడా ఉండడం.. నిజంగా గొప్ప విషయమని విశ్లేషకులు అంటున్నారు.