ఓ వైపు.. దేశంలో కరోనా విజృంభిస్తోంది. అటు చూస్తే ఐపీఎల్ ఆరంభం కాబోతోంది. ఈ సారి భయాందోళనల మధ్యే ఐపీఎల్ సీజన్ నడుస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఐపీఎల్.. అంటేనే ధనాధన్ పండుగ. కళ్లు చెదిరే షాట్స్.. ఉత్కంఠ రేపే పోరు.. అబ్బురపరిచే విన్యాసాలు.. ఆకట్టుకునే బౌలింగ్.. వాహ్ ఒక్కటేమిటి.. ఆద్యంతం మ్యాచ్ ముగిసే వరకూ ఆసక్తికరమే. క్రికెట్ ప్రేమికులకు నిజంగా పండుగే. ఐదు నెలల్లో ఇది రెండో ఐపీఎల్. అటు కరోనా కట్టడి చేస్తుంటే.. ఈ సీజన్ నిర్వహణ కూడా కష్టమే. కానీ.. ఈ సందర్భంలో కూడా బీసీసీఐ ఛాలెంజ్‌గా తీసుకొని ఐపీఎల్ నిర్వహణకే మొగ్గు చూపింది. సక్సెస్ ఫుల్‌గా రన్ చేసేందుకే సిద్ధపడింది. ఎనిమిది జట్లు.. 60 మ్యాచ్‌లు.. ఆరు వేదికలు అన్నట్లుగా నడిచే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 30న జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి.
ఓ వైపు.. దేశవ్యాప్తంగా కోవిడ్ భయపెడుతోంది. మరోవైపు.. శుక్రవారం నుంచే ఐపీఎల్ 14 ప్రారంభం కాబోతోంది. ఇంకోవైపు చూస్తే రోజుకు లక్ష దాటుతున్న కరోనా కేసులు. ఇవి సగటు ప్రేక్షకుడికి ఆందోళన కలిగిస్తున్నా.. క్రికెటర్లు కొట్టే సిక్స్‌లు.. సర్రున దూసుకుపోయే యార్కర్లు ఉపశమనాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. చెన్నైలో జరిగే మొదటి మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.. విరాట్ నేతృత్వంలోని బెంగళూరును ఢీకొంటోంది. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లున్న నేపథ్యంలో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే రికార్డు స్థాయిలో ఐదు సార్లు టైటిల్ సాధించిన ముంబయి.. టోర్నీలో మరోసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది. అత్యంత బలమైన జట్టు రోహిత్ చేతిలో ఉంది. రోహిత్, డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమర్, హార్దిక్, కృనాల్, పొలార్డ్.. ఇలా ఒకరి తర్వాత మరొకరు ప్రత్యర్థి బౌలర్లను పరీక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. బుమ్రా, బౌల్డ్‌లతో అత్యంత బలమైన బౌలింగ్ దళం కూడా ముంబయి టీమ్‌లో ఉంది.
ఈసారైనా టైటిల్ కైవసం చేసుకొని బోణి కొట్టాలని ఎంతో ఆశతో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి వేలంలో భారీ మొత్తాలకు కొన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, కైల్ జేమీసన్ ఏ మేరకు రాణిస్తారన్నది ఆసక్తికరం. సూపర్ ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. డివిలయర్స్‌పై ఆ జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ముస్తాక్ అలీ ట్రోఫిలో చెలరేగిన కొత్త వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఎలా ఆడుతారన్నది ఆసక్తికరం.
ఈ సీజన్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కరోనా రక్కసి భయపెడుతున్నా.. లీగ్‌ను సైతం వెంటాడుతున్నా.. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించేసింది. అయితే.. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే గతేడాది సెప్టేంబర్‌కు ముందు రోజువారీ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా లీగ్‌ను యూఏఈకి తరలించారు. ఆ తర్వాత వైరస్ ఉధృతి తగ్గడంతో భారత్‌లోనే ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ.. సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ కరోనా ఉధృతి తీవ్రమైంది. ఐపీఎల్‌లో భాగమైన వారు కొవిడ్ బారిన పడుతున్నారు. కరోనా వెంటాడుతున్నా.. యూఏఈలోలాగే విజయవంతంగా టోర్నీ నిర్వహించగలమన్న ఆశాభావంతో బీసీసీఐ ఉంది. ఈ ఏడాదే భారత్‌లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ లీగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.
గత సీజన్‌లు మాదిరిగానే ఈసారి మధ్యాహ్నం మ్యాచ్ 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్ 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఐపీఎల్ ప్రారంభం నుంచి.. భారత్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గతంలో ఐపీఎల్ జట్లు సొంతగడ్డలో ఏడు, బయట ఏడు మ్యాచ్‌లు ఆడేవి. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో కొన్ని మార్పులు చేశారు. ఈసారి ఆరు వేదికల్లో ఐపీఎల్ జరగనుండగా.. ఏ జట్టు సొంతగడ్డపై ఆడదు. లీగ్ దశలో ఏ జట్టయినా నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడనుంది. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది.
ఐపీఎల్‌లో తొలిసారి అడుగుపెడుతున్న ప్లేయర్స్‌పై ఈసారి భారీ ఆశలు పెట్టుకున్నాయి ఆయా జట్లు. కొంత మంది ప్లేయర్స్ కూడా తొలి అడుగులోనే బలమైన ముద్ర వేయాలనే పట్టుదలతో ఉన్నారు. వాళ్లలో సచిన్ తనయుడు అర్జున్ తెందుల్కర్ (ముంబయి) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. షారుక్ ఖాన్ (పంజాబ్ కింగ్స్), మహ్మద్ అజహరుద్దీన్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మరోవైపు జెమీసన్, ఫిన్ అలెన్ (ఆర్సీబీ), రిచర్డ్‌సన్, మెరెడిత్, డేవిడ్ మలన్ (పంజాబ్ కింగ్స్), మార్కో జాన్సెన్ (ముంబయి) లాంటి విదేశీ ఆటగాళ్లూ సత్తాచాటేందుకు రెడీ అయ్యారు.
మరోవైపు.. ఈ ఐపీఎల్‌లో మరో ప్రత్యేకత కూడా కనిపిస్తోంది. ఇద్దరు యువ ఆటగాళ్లు తొలిసారి టోర్నీలో నాయకత్వం వహించబోతున్నారు. ఢిల్లీకి పంత్, రాజస్థాన్‌కు శాంసన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఐపీఎల్ జట్లకు సారథ్యం వహిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు వికెట్ కీపర్లే కావడం విశేషం.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Corona time ipl challenge to bcci
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com