Rishabh Pant : ఇటీవలి ఐపిఎల్ మెగా వేలంలో హైయెస్ట్ ప్రైస్ దక్కించుకున్న ఆటగాడిగా రిషబ్ పంత్ సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. లక్నో జట్టు అతనిని అత్యంత పోటీమధ్య 27 కోట్లు పెట్టి మరి సొంతం చేసుకుంది. అయితే అద్భుతమైన టాలెంట్, అనితరసాధ్యమైన బ్యాటింగ్ చేసే పంత్ ఢిల్లీ జట్టుకు ఎందుకు దూరమయ్యాడు? ఆ జట్టు యాజమాన్యంతో ఏమైనా గొడవలు ఉన్నాయా? లేక పంత్ ఇంకేదైనా అడిగాడా? ఈ ప్రశ్నలకు నిన్నటి వరకు సమాధానాలు లభించలేదు. అయితే పంత్ లక్నో జట్టుకు వెళ్లిపోయిన తర్వాత.. అతడు ఎందుకు ఢిల్లీ జట్టు నుంచి బయటికి వచ్చాడు? దీనికి దోహదం చేసిన కారణాలు ఏంటి? అనే ప్రశ్నలకు ఢిల్లీ జట్టు కోచ్ హేమంగ్ బదాని తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. దీంతో స్పోర్ట్స్ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇదే సమయంలో పంత్ మామూలోడు కాదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అందువల్లే బయటికి వచ్చాడట
ఢిల్లీ జట్టు నుంచి ఎందుకు బయటకు వచ్చాడో ఇంతవరకు రిషబ్ పంత్ వెల్లడించలేదు. పైగా అతడిని లక్నో జట్టు కొనుగోలు చేసిన తర్వాత ఉత్సాహంగా కనిపించాడు. ఐపీఎల్ మెగా వేలంలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఏకంగా 27 కోట్లు ధర పలికి.. హేమా హే మీలాంటి ఆటగాళ్లకు కూడా అసూయ పుట్టించాడు. ఢిల్లీ జట్టు యాజమాన్యంతో ఎటువంటి విభేదాలు లేకపోయినప్పటికీ.. రిషబ్ పంత్ బయటకు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నాడట. అందువల్లే వేలంలోకి వెళ్ళాడట. తనకు ఎంత డిమాండ్ ఉందో చూసేందుకు జట్టు నుంచి బయటికి వచ్చాడట. ఎవరు ఎంత చెప్పినా రిషబ్ పంత్ వినిపించుకోలేదట. అందువల్లే లక్నో జట్టు భారీ ధరకు అతడిని కొనుగోలు చేసిందట. అయితే రిషబ్ పంత్ భారీ ధరను దక్కించుకోవడంతో ఢిల్లీ జట్టు యాజమాన్యం కూడా హర్షం వ్యక్తం చేసిందట. ఇదే విషయాన్ని ఢిల్లీ జట్టు కోచ్ హేమంగ్ బదాని పేర్కొన్నాడు..” అతడికి మేము చెప్పి చూసాం. కానీ వినిపించుకోలేదు. బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే భారీ ధర పలికాడు. మొత్తంగా చూస్తే రేర్ ఫీట్ నమోదు చేశాడని” బదానీ వ్యాఖ్యానించాడు. “రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పటికీ.. ఆట మీద అత్యంత ఇష్టంతో కోలుకున్నాడు. తిరుగులేని స్థాయిలో ప్రతిభ చూపుతున్నాడు. అందువల్లే అతడు ఇంతటి పేరును సంపాదించుకున్నాడు. ఎటువంటి నేపథ్యంలోని ఒక యువకుడు ఈ స్థాయిలో ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అతడు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతని నుంచి చాలామంది, చాలా నేర్చుకోవాల్సి ఉందని” హేమంగ్ బదానీ వ్యాఖ్యానించాడు.