Chris Woakes Returns to England Team : ఫస్ట్ టెస్ట్ కు సమయం ఉన్నప్పటికీ.. ఆంగ్ల జట్టు టీమ్ ఇండియాకు డేంజర్ సిగ్నల్స్ పంపించింది. తమ బౌలర్లతో మీకు ఈసారి చుక్కలు కనిపిస్తాయని చెప్పగానే చెప్పింది. ఇప్పటికే భారత జాతీయ జట్టు కాకుండా.. మరో జట్టు ఇంగ్లీష్ జట్టుతో అనధికారిక టెస్టులు ఆడుతోంది. ఇందులో తొలి టెస్ట్ ఉత్కంఠ గా సాగింది. చివరికి డ్రా అయింది. ఇక రెండో టెస్ట్ కూడా సాగుతోంది. ఈ టెస్టులో నయా వాల్ కే ఎల్ రాహుల్ శతకం కొట్టాడు. తద్వారా టీమిండియా కు శుభసంకేతాలు పంపించాడు. అయితే ఇంగ్లీష్ జట్టులో అనుభవజ్ఞుడైన బౌలర్ ముప్పుగా మారాడు. టీమిండియా కు తన నుంచి ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు పంపాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరంటే..
Also Read : 14.25 సగటు, 57 పరుగులు..గిల్ ను కలవర పెడుతున్న ఇంగ్లీష్ గడ్డ.. ఈసారి ఏం చేస్తాడో?!
ఇంగ్లీష్ జట్టులో క్రిస్ వోక్స్ అనుభవజ్ఞుడైన బౌలర్ గా ఉన్నాడు. అతడు రెండవ అనధికారిక టెస్టులో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలింగ్ వేసే అతడు 20 ఓవర్లు వేసి.. 60 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టాడు. ఒక రకంగా భారత జట్టు టాప్ ఆర్డర్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టాడు. జైస్వాల్ ను మొదటి వికెట్ గా, అభిమన్యు ఈశ్వరన్ ను రెండవ వికెట్ గా, కరుణ్ నాయర్ ను మూడో వికెట్ గా వెనక్కి పంపించాడు. అయితే ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా అతడికి వికెట్ల ముందు దొరికిపోవడం విశేషం. జైస్వాల్ 11, అభిమన్యు 11, నాయర్ 40 పరుగులు చేశారు..
అనధికారిక టెస్టులో ప్రతిభ చూపించిన నేపథ్యంలో వోక్స్ జాతీయ జట్టులో సత్తా చూపించే అవకాశం కనిపిస్తోంది..గిల్ జట్టుతో జరిగే సిరీస్లో అతడికి ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ చోటు కల్పించింది.. గతంలో కూడా వోక్స్ ఇండియా పై అదిరి పోయే రేంజ్ లో బౌలింగ్ వేశాడు. ముఖ్యంగా 2018లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో భారత జట్టుపై అద్వితీయమైన ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు భారీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆ మ్యాచ్లో వోక్స్ 137 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అంతేకాదు నాలుగు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నాటి మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు 159 రన్స్ తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది.
ఇక మన జట్టుపై వోక్స్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. అతడు మన జట్టుపై తొమ్మిది మ్యాచ్ లు ఆడాడు. 33.30 సగటుతో 23 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 320 రన్స్ కూడా చేశాడు. ఇక ఇప్పటివరకు సుదీర్ఘ ఫార్మాట్లో వోక్స్ 181 వికెట్లను పడగొట్టాడు. అయితే ఇందులో 137 వికెట్లు స్వదేశంలోనే సొంతం చేసుకోవడం విశేషం. మొత్తంగా చూస్తే వోక్స్ భారత జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో సత్తా చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సిరీస్ ఇంగ్లీష్ గడ్డపై జరుగుతోంది కాబట్టి. 18 సంవత్సరాలుగా టీమిండియా ఇంగ్లీష్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తోంది.