India Vs Australia WTC Final: 2021లో చేజారిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదల మీద ఉంది రోహిత్ సేన. ఇంగ్లండ్ వేదికగా జూన్ 7 నుంచి ఆరంభమయ్యే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమిండియా ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు పయనమయ్యారు. ప్రస్తుతం లండన్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు.
అతడే కీలకం..
ఇక ఫైనల్లో భారత్ గెలవాలంటే బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాలి. ఆసీస్‌తో జరిగే ఫైనల్ ఫైట్‌లో ఒక టీమిండియా బ్యాటర్ ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే అతడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు. రోహిత్, కోహ్లీ, గిల్, జడేజా లాంటి ప్లేయర్లు ఐపీఎల్ లో బిజీ బిజీగా ఉంటే.. నయా వాల్ చతేశ్వర్ పుజారా మాత్రం ఇంగ్లండ్ కు వెళ్లాడు. రెండు నెలలుగా అక్కడే ఉన్న అతడు కౌంటీ క్రికెట్‌లో సస్సెక్స్ తరఫున బరిలోకి దిగాడు. కౌంటీ సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 3 సెంచరీలు.. ఒక అర్ధ సెంచరీ చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే పుజారా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. రెండు నెలలుగా అక్కడే ఉండటంతో పుజారాకు అక్కడి పరిస్థితులపై ఒక అవగాహన ఉంది.
టెస్ట్ ఫార్మాట్‌కు అలవాటు పడాలి..
ఇన్ని రోజులు టీమిండియా ప్లేయర్లు ఐపీఎల్ ఆడినందున టెస్టు ఫార్మాట్ కు అలవాటు పడాల్సి ఉంది. కానీ, పుజారాకు ఆ సమస్య లేదు. దాంతో ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్లో పుజారా టీమిండియాకు కీలకం కానున్నాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో.. టీమిండియా ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే నేరుగా ఫైనల్లో ఆడనుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం రోహిత్, కోహ్లీ, గిల్, రహానేలకు అంత సులభంగాంగా ఉండదు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు చేయాలంటే పుజారా కీలకం కానన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఎప్పుడూ చెలరేగిపోయే పుజారా నుంచి ఆస్ట్రేలియాకు ఊహించని ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంది.
నయావాల్‌గా నిలిస్తే ..
ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వాతావరణం.. ఆస్ట్రేలియా వాతావరణంతో సమానంగా ఉంటుంది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు త్వరగా అలవాటు పడాల్సింది ఇండియన్ ప్లేయర్లే. ఇక ఇప్పటికే ఇంగ్లడ్ పరిస్థితులకు అలవాటు పడిన పుజారా తన సూపర్ ఫాం కొనసాగిస్తే ఆస్ట్రేలియా దూకుడుకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. పుజారాకు రోహిత్‌శర్మ, కోహ్లి, గిల్ లాంటి ఆటగాళ్ల నుంచి సహకారం లభిస్తే టీమిండియాకు తిరుగుండదు.