Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్ ఏదైనా అదరగొట్టే జట్టు మాత్రం చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతోంది ఈ జట్టు. ఒకటి.. రెండు సీజన్లు మినహా దాదాపు అన్ని సీజన్లోనూ ఈ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్ క్వాలిఫై అయింది. ఇప్పటి వరకు మరే జట్టు సాధించలేని ఘనతలను ఈ జట్టు సాధించింది.
ఐపీఎల్ 16వ ఎడిషన్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరింది. ఆదివారం సాయంత్రం తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై జట్టు అదరగొట్టింది. దీంతో ఈ ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరినట్లు అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ముఖ్యమైన మ్యాచ్ లో చెన్నై జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టి 77 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో సగర్వంగా ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గెలిచి.. నిలిచిన చెన్నై
ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు మూడు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సులు, మూడు ఫోర్లు ఉండగా 158 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కాన్వే 52 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 167.31 స్ట్రైక్ రేట్ తో మూడు సిక్సులు, 11 ఫోర్లు కొట్టాడు ఈ క్రికెటర్. ఆ తర్వాత వచ్చిన శివం
దుబే 9 బంతుల్లో 22 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా ఏడు బంతుల్లో 20 పరుగులు చేయడంతో భారీ స్కోరు లభించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయడంతో 77 పరుగుల భారీ తేడాతో చెన్నై జట్టు విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 58 బంతుల్లో ఐదు సిక్సులు, ఏడు ఫోర్లతో 86 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహార్ నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును గట్టిగా దెబ్బ తీశాడు. మహేష్ తీక్షణ రెండు వికెట్లు, మతిస పతిరాన రెండు వికెట్లు పడగొట్టారు.
అద్భుతంగా సాగుతున్న ఐపీఎల్ లో చెన్నై జర్నీ..
ఈ ఒక్క సీజనే కాకుండా ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టు ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. 2008లో ఫైనల్ కు చేరింది ఈ జట్టు. 2009లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా, 2010లో ఛాంపియన్ గా నిలిచింది. 2011లోనూ మరోసారి ఛాంపియన్ కాగా, 2012లో ఫైనల్ లో ఓటమిపాలైంది. 2013లో ఫైనల్లో మరోసారి ఓటమి చెందింది. 2014 లో మూడో స్థానానికి పరిమితమైంది. 2015 లో ఫైనల్లో ఓడిపోగా,
2018లో మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. 2019లో ఫైనలిస్ట్ కాగా 2020లో ఏడో స్థానం కాగా, 2021లో మరోసారి ట్రోపీని ఒడిచిపట్టింది చెన్నై జట్టు. 2022లో 9వ స్థానంతో సరిపెట్టుకోగా, తాజా ఎడిషన్ లో ప్లే ఆఫ్ కు క్వాలిఫై మరోసారి కప్పు పై కన్నేసింది.
నాలుగు సార్లు కప్పు కొల్లగొట్టిన చెన్నై..
ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ కప్పు గెలుచుకుంది. తాజాగా మరోసారి కప్పు సాధించడమే లక్ష్యంగా ఆ జట్టు ప్రయాణం సాగుతోంది. ఓపెనర్లు అద్భుతమైన ఫామ్ లో ఉండడంతో ప్రతి మ్యాచ్ లోనూ రాణిస్తున్నారు. ఇకపోతే చెన్నై జట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. తొలిసారి 2010లో ఛాంపియన్ గా నిలిచిన చెన్నై జట్టు, వరుసగా రెండోసారి కూడా 2011లో ట్రోఫీని సాధించింది. 2018లో మూడోసారి ఛాంపియన్ గా అవతరించింది చెన్నై జట్టు. 2021లో మరోసారి ఛాంపియన్ గా నిలిచి తన సత్తాను చాటింది. ఐదోసారి ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా చెన్నై జట్టు ప్రస్తుతం ముందుకు సాగిపోతుంది.