India Cricket Team Captiain : వరల్డ్ కప్ తరువాత కెప్టెన్సీ పగ్గాలు మార్పు.. రేసులో ముగ్గురు

కోహ్లీని పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

Written By: BS, Updated On : July 21, 2023 8:30 am
Follow us on

India Cricket Team Captiain : భారత్ వేదికగా అక్టోబర్ నెలలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ లోను కీలక మార్పులు చేసేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. వరల్డ్ కప్ ఫలితాలతో సంబంధం లేకుండా పలువురు క్రికెటర్లకు బీసీసీఐ షాక్ ఇవ్వబోతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ తర్వాత కూడా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన సన్నిహితుల వద్ద రోహిత్ శర్మ ఈ మాట చెప్పాడు. ఇదే జరిగితే భారత జట్టు పగ్గాలు అందుకునేందుకు మరో ముగ్గురు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఆటగాళ్లు విమర్శలు ఎదుర్కొన్నారు. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మపై విమర్శలు ఎక్కు పెట్టిన వారి సంఖ్య భారీగానే కనిపించింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల తప్పించాలని పలువురు మాజీ క్రికెటర్లతోపాటు విశ్లేషకులు కూడా డిమాండ్ చేశారు. ఈ విమర్శలతో తీవ్రంగా బాధపడిన రోహిత్ శర్మ అప్పట్లోనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించాడు. అయితే వన్డే వరల్డ్ కప్ వరకు ఉండి తనను తాను నిరూపించుకొని తప్పించుకోవాలని భావించినట్లు తెలిసింది. అయితే, బీసీసీఐ కూడా వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టులో ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. పలువురు ఆటగాళ్లపై వేటు వేయడంతోపాటు రోహిత్ శర్మ కెప్టెన్సీపైనా వేటు వేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
సమర్థవంతమైన ఆటగాళ్లపై కన్నేసిన బీసీసీఐ..
వరల్డ్ కప్ వరకు నిరీక్షించిన తర్వాత ఫలితాలను బట్టి జట్టులో ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు అనుగుణంగా జట్టులో మార్పులు చేయడంతోపాటు కీలక ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని బిసిసిఐ నిర్ణయించింది. వరల్డ్ కప్ లో ఫలితాలు ఇబ్బందికరంగా కనిపిస్తే రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే గనుక జరిగితే కెప్టెన్సీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న దానిపైన బీసీసీఐ దృష్టి సారించింది. ఇందుకు ముగ్గురు కీలక ఆటగాళ్లపై బీసీసీఐ కన్నేసినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. వీరిలో ముందంజలో ఉన్నాడు హార్దిక్ పాండ్యా. ఇప్పటికే టి20 జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. టీమిండియాలో ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యాకు మంచి స్థానమే ఉంది. కెప్టెన్ గాను మంచి ప్రదర్శన చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మహేంద్రసింగ్ ధోని, కపిల్ దేవ్ శైలి జత కలుస్తున్నాయంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదటి సీజన్ లోనే ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పటికే టి20 జట్టు కెప్టెన్ గాను భారత జట్టుకు మంచి విజయాలను అందిస్తున్నాడు. వన్డే జట్టుకు కెప్టెన్ గా మారితే మెరుగైన విజయాలను నమోదు చేసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు సూర్య కుమార్ యాదవ్. విధ్వంసకర బ్యాటింగ్ కు పెట్టింది పేరుగా మారిపోయాడు సూర్య కుమార్ యాదవ్. జట్టులో గత కొన్నాళ్ల నుంచి స్థిరమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కెప్టెన్సీ పగ్గాలు తీసుకునే స్థాయి ఉన్న ఆటగాడు అంటూ నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. అనుభవం కూడా కలిసి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే ఈ జాబితాలో వినిపిస్తున్న మరో పేరు విరాట్ కోహ్లీ. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించాడు. అయితే, 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ పగ్గాలు ఇస్తే తీసుకుంటాడో లేదో అన్నది తెలియదు. యువ జట్టును సిద్ధం చేసే పనిలో ఉన్న బీసీసీఐ మళ్లీ సారధ్య బాధ్యతలను సీనియర్లకు అప్పగిస్తుందా..? అన్నది కూడా సందేహంగా ఉంది. కోహ్లీని పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.