https://oktelugu.com/

YCP MLA : ఇతడు ఏపీ నీరవ్‌ మోదీ.. ఏకంగా 908 కోట్లకు టోకరా వేశాడు

శ్రీధర్‌ రెడ్డి 2014కు ముందే ఆర్థికంగా చితికిపోయారని తెలిసింది. అయితే, వైసీపీ నేతగా ఆయన తన ప్రాబల్యాన్ని ప్రదర్శించి తెలంగాణలోని బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారని... వడ్డీతో కలిపి ఆ మొత్తం 908 కోట్లకు చేరిందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2023 / 08:17 AM IST
    Follow us on

    YCP MLA : దోచుకోవడం.. ఆపై దాచుకోవడం.. ఇప్పటిదాకా మనకు రాజకీయ నాయకులు అంటే పై మాటలే.. కానీ ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి ఎమ్మెల్యే ఒక అడుగు ముందుకేసారు. జనం సొమ్ముతో నడిచే బ్యాంకులను.. జనం ఓట్లతో గెలిచి.. నిండా ముంచారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 900 కోట్లు.. చదువుతుంటేనే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కదూ! అవును మరి. తనకున్న రాజకీయ బలంతో, అర్థ బలంతో అడ్డగోలుగా బ్యాంకులకు టోకరా పెట్టారు. ఒక సామాన్యుడు రుణం కోసం వెళితే సవా లక్ష నిబంధనలు విధించే బ్యాంకులు.. ఒక రాజకీయ నాయకుడు సేవలు మాత్రం పాహి అంటూ సేవలో మునిగి తేలాయి. అసలు అతడు అంత అప్పు తీర్చగలడా? అతడి కంపెనీలకు ఉన్న సామర్థ్యం ఎటువంటిది? అసలు అవన్నీ అతడి నిజమైన ఆస్తులేనా? ఒకవేళ ఆస్తులు గనక ఉండి ఉంటే బహిరంగ మార్కెట్లో వాటి విలువ ఎంత? ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండానే, లెక్కలేని విధంగా రుణాలు ఇచ్చాయి. ఇప్పుడేమో తలలు పట్టుకుంటున్నాయి. ఇంతటి సుదీర్ఘ ఎపిసోడ్లో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఇతడు ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కావడం.. పైగా ఇతడికి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉండటం.. అంతేలెండి ముఖ్యమంత్రే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు.. ఎమ్మెల్యే అయి ఉండి ఆ మాత్రం చేయకూడదా?!

    ముమ్మాటికీ ఏపీ నీరవ్ మోదీ!

    విజయ్‌ మాల్యా… నీరవ్‌ మోదీ… మెహుల్‌ చోక్సీ! బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి… విదేశాలకు చెక్కేసిన బడా వ్యాపార వేత్తలు వీళ్లు! ఇప్పుడు… ‘ఏపీ నీరవ్‌ మోదీ’ ఒకరు బయటపడ్డారు. ఆయన బ్యాంకులను రూ.908 కోట్లకు ముంచేశారు. ఆయనే… పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్‌రెడ్డి! ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితుడు! శ్రీధర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకతోపాటు ఆఫ్రికాలోని ఉగాండాలోనూ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన వివిధ బ్యాంకులకు రూ.908.20 కోట్ల రుణం ఎగవేశారు. రాజకీయ నేపథ్యం, ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం ఉండటంతో… శ్రీధర్‌ రెడ్డిని టచ్‌ చేసేందుకు బ్యాంకర్లు బెదిరిపోతున్నారు. శ్రీధర్‌ రెడ్డిది ఉమ్మడి అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్లసింగయ్యగారి పల్లి స్వగ్రామం. ఆయన తల్లి స్వగ్రామం కడప జిల్లా పులివెందులలోని బలపనూరు. వైఎస్‌ రాజశేఖర రెడ్డిది కూడా ఇదే ఊరు. శ్రీధర్ రెడ్డి తొలుత కస్టమ్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు. ఉద్యోగం వదిలేసి కాంట్రాక్టులు, వ్యాపారాలు మొదలుపెట్టారు. ఆయనకు ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ పేరిట కంపెనీ ఉంది. ప్రస్తుతం ఇది సాయిసుధీర్‌ ఇన్‌ఫ్రా పేరిట మారినట్లు తెలిసింది.

    2014కు ముందే ఆర్థికంగా చితికిపోయారు

    శ్రీధర్‌ రెడ్డి 2014కు ముందే ఆర్థికంగా చితికిపోయారని తెలిసింది. అయితే, వైసీపీ నేతగా ఆయన తన ప్రాబల్యాన్ని ప్రదర్శించి తెలంగాణలోని బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారని… వడ్డీతో కలిపి ఆ మొత్తం 908 కోట్లకు చేరిందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేతోపాటు ఆయన సతీమణి, తండ్రి పేరిట ఈ అప్పులు తీసుకొచ్చారు. రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. బ్యాంక్‌ల నుంచి వచ్చే ఫోన్‌లు ఎత్తడం మానేశారు. నోటీసులు తీసుకోవడం లేదని, తీసుకున్నా తిరిగి వాటికి బదులివ్వడం లేదని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విసిగి వేసారిన బ్యాంకులు జాతీయస్థాయిలో బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించాయి. రుణాలకోసం ఆయా బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని నోటీసు ఇచ్చాయి. అయినా శ్రీధర్‌ రెడ్డి స్పందించలేదని తెలిసింది. దీంతో ఆయనది ఉద్దేశపూర్వకమైన ఎగవేతగానే బ్యాంక్‌లు నిర్ధారణకు వచ్చాయి. రుణ ఒప్పందాలు, రుణ రికవరీ నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన ఆస్తులను తక్షణమే వేలంవేయాలని ఇటు ఆర్‌బీఐ ఆదేశించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను కెనరా బ్యాంకుకు అప్పగించారు.

    వచ్చేనెల 18న ఆస్తులు ఈ-వేలం

    ఎమ్మెల్యే తనఖా పెట్టిన ఆస్తులపై అధ్యయనం పూర్తిచేసి వాటి వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఇంజనీరింగ్‌ కంపెనీ పేరిట ఉన్న ఆస్తులను ఆగస్టు 18వ తేదీన ఇ-వేలం వేస్తామని కెనరా బ్యాంకు ఈ నె ల 2వ తేదీన ఇచ్చిన నోటీసులో పేర్కొంది. ఇలా మొత్తం ఆస్తుల విలువ 54.73 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక… రుణాల ఎగవేతకు పూర్తిగా సిద్ధపడ్డ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి ఐపీ (దివాలా పిటిషన్‌) పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.. అన్నట్టు కేవలం శ్రీధర్ రెడ్డి మాత్రమే కాకుండా అప్పట్లో ఏపీలోని రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, సుజనా చౌదరి వంటి వారు కూడా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఓ జాతీయ బ్యాంకు అధికారులు కావూరి సాంబశివరావు కు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు ప్రయత్నించగా.. పై స్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్ల వారు విరమించుకున్నారు. అయితే ప్రస్తుతం శ్రీధర్ రెడ్డి కూడా అలానే వ్యవహరిస్తుండడంతో బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.