Champions Trophy 2025: గోటి చుట్టూ రోకటి పోటు అంటే ఇదే కాబోలు.. 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నీ నిర్వహిస్తున్నామనే ఆనందం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఏ మాత్రం లేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు వరుస వర్షాలు మూడు లీగ్ మ్యాచ్ ల రద్దుకు కారణమయ్యాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విమర్శల పాలు కాక తప్పలేదు.
Also Read: ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ పోరు వీటి మధ్యే.. ఇండియాతో తలపడే జట్టు ఏదంటే..
ఛాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు 590 కోట్లు ఖర్చు చేసింది. రావల్పిండి, లాహోర్, కరాచీ మైదానాలలో ఆధునికరించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో భారీగానే ఆదాయం వస్తుందని భావించింది. టీమిండియాను ఆడాలని కోరింది. భద్రతా కారణాల వల్ల బిసిసిఐ దానికి నిరాకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ వేదికగా సాగుతున్నాయి. సాధారణంగా టీమ్ ఇండియా క్రికెట్ ఆడితే యాడ్స్ పరంగా ఆదాయం భారీగా వస్తుంది. వ్యూయర్ షిప్ కూడా అధికంగా ఉంటుంది. ఇటీవల భారత్ పాకిస్తాన్ ఆడిన మ్యాచ్ ఏకంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. భారత్ పాకిస్తాన్ లో ఆడక పోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు భారీగానే నష్టం వాటిల్లింది. ఇక చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 25, 27, 29 లో జరగాల్సిన మ్యాచులు వర్షాల వల్ల రద్దయ్యాయి. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు పూర్తి డబ్బులను రిఫండ్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.. డ్యామేజ్ అవని ఒరిజినల్ టికెట్లతో వచ్చి సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సూచించింది.. ఇక బాక్సెస్, గ్యాలరీ టికెట్లు తీసుకున్న వారికి రీఫండ్ వర్తించదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తం
పాకిస్తాన్ లో రావల్పిండి మైదానం లో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం కూడా లేకపోయింది. దీంతో మ్యాచ్ ల నిర్వహణ సాధ్యం కాలేదు. ఫలితంగా అంపైర్లు టాస్ వెయ్యకుండానే మ్యాచ్ లను రద్దు చేశారు. అంతేకాదు ఆయా జట్లకు చెరో పాయింట్లు కేటాయించారు. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీకి 590 కోట్లు ఖర్చు చేసింది. ఇటు వర్షాల వల్ల మూడు మ్యాచ్ లు రద్దయ్యాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విమర్శల పాలు కాక తప్పలేదు. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళిపోయింది.. సొంత దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పటికీ.. ఒక్క విజయం కూడా దక్కించుకోలేక తీవ్ర విమర్శల పాలైంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు విఫల ప్రదర్శన చేసిన నేపథ్యంలో.. స్పాన్సర్లు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఆ జట్టు క్రికెట్ భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. మరోవైపు మ్యాచులకు ప్రేక్షకులు హాజరు కాకపోవడంతో మైదానాలు వెలవెల పోతున్నాయి. ఇంకోవైపు దుబాయ్ లో భారత్ ఆడుతున్న మ్యాచ్లకు ప్రేక్షకులు భారీగా రావడంతో మైదానం కిటకిటలాడుతోంది.
Also Read: క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ జట్టుకు ఏమైంది? మరీ ఇంత దారుణమైన ప్రదర్శనా?