Case Filed on RCB : మొదట్లో ఈ వేడుక ఎట్టి పరిస్థితుల్లో జరగదని అభిప్రాయానికి వచ్చిన అభిమానులు.. చివరికి కర్ణాటక రాజధాని లోని శాసనసభ వద్దకు చేరుకున్నారు. విక్టరీ పరేడ్ లేదని చెప్పడంతో.. చిన్నస్వామి మైదానం వద్దకు భారీగా చేరుకున్నారు. వాస్తవానికి ఆ మైదానం సామర్థ్యం 35,000 మాత్రమే. కానీ దాదాపు నాలుగైదురెట్ల మంది ఆ మైదానం వద్దకు చేరుకున్నారు. భారీగా అభిమానులు రావడంతో గేట్లను తెరవలేదు. దీంతో అభిమానులు గంటల తరబడి పడిగాపులు కాశారు. చివరికి మైదానంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. చూస్తుండగానే దారుణం జరిగిపోయింది. రక్షక భటులు పెద్దగా పట్టించుకోకపోవడం.. విజయ యాత్ర నిర్వహిద్దామని గట్టిగా చెప్పిన కన్నడ జట్టు యాజమాన్యం కళ్లకు కనిపించకపోవడం.. వెలుపల ఘోరం జరుగుతున్నప్పటికీ లోపల యథావిధిగా సంబరాలు జరపడంతో కన్నడ జట్టు యాజమాన్యంపై ఆగ్రహం పెరిగిపోయింది. మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చాయి.
Also Read : వెర్రి అభిమానానికి అప్పట్లో ఏకంగా 16 మంది.. భారత క్రీడా చరిత్రలో అత్యంత విషాదాలివి!
11 మంది అభిమానుల మృతికి కారణం కావడంతో బెంగళూరు యాజమాన్యంపై, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై పోలీసుల కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ అని పేర్కొంటూ ఈవెంట్ ఆర్గనైజర్ డిఎన్ఏ పై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. విక్టరీ పరేడ్ ఉందంటూ కన్నడ జట్టు యాజమాన్యం నిన్న చేసిన ట్వీట్ పై కూడా విచారణ చేపడతామని కర్ణాటక పోలీసులు చెబుతున్నారు. అభిమానులు భారీగా వస్తారని.. వారిని అదుపు చేయడం కష్టమవుతుందని పోలీసులు సూచించారని.. అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పట్టించుకోలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. వాస్తవానికి బెంగళూరులో రోడ్లు చిన్నవిగా ఉంటాయి. చిన్నస్వామి మైదానం కూడా బెంగళూరు నగరంలోని నడిబొడ్డునే ఉంటుంది. ఇలాంటి సందర్బంలో బెంగళూరు యాజమాన్యం వెనుక ముందు ఆలోచించకుండా.. క్రికెటర్లకు సమయం లేకపోవడం వల్ల.. హడావిడిగా విక్టరీ పరేడ్ నిర్వహించింది. ముందుగా విక్టరీ పరేడ్ నిర్వహిస్తామని చెప్పింది. ఆ తర్వాత క్యాన్సల్ చేసింది. బస్సు ప్రదర్శన లేకుండా నేరుగా మైదానంలోకి ప్లేయర్లను తీసుకెళ్లింది. చివరికి ఇంతటి విషాదం జరిగింది.
కన్నడ జట్టు యాజమాన్యంపై కేసు నమోదు కావడంతో సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోలీసులు ముందుగానే ఈ పని చేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “అభిమానులను రెచ్చగొడతారు. విక్టరీ పరేడ్ కు రావాలని పిలుపునిస్తారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏమాత్రం అనుకూలంగా పరిస్థితి ఉండదు. చివరికి ఇలాంటి విషాదాలు జరిగిన తర్వాత కూడా వారిలో చలనం ఉండదు. వారికి కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే. అభిమానం అనేది వారికి ఒక రకమైన కాసులు కురిపించే వ్యవహారమని.. ఇలాంటి దిక్కుమాలిన జట్లకు సపోర్ట్ చేయడం మూర్ఖత్వం అని” నెటిజన్లు పేర్కొంటున్నారు.