KK survey 2025 : ఎప్పుడైతే కేకే సర్వే వాస్తవ పరిస్థితి ఆధారంగా వివరాలను వెల్లడించిందో.. అప్పటినుంచి ఆ సంస్థకు క్రెడిబిలిటీ పెరిగింది. ఇదే సమయంలో ఆ సంస్థ హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దూరంగా వచ్చాయి. దీంతో కేకే సర్వే శాస్త్రీయత మీద జనాలకు నమ్మకం పోయింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి కేకే సంస్థ ఒక సర్వే వివరాలను వెల్లడించింది. ఏపీలో కేకే సంస్థ ఇటీవల కాలంలో ఒక సర్వే జరిపింది. దీని వెనక ఎవరున్నారు? ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేశారు? అసలు ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలను పక్కన పెడితే కేకే సంస్థ తను చేసిన సర్వే వివరాలను వెల్లడించింది.
Also Read : బతికున్న మనిషిని చనిపోయాడని చెబుతారా? “మాగంటి” పై బ్రేకింగ్ న్యూస్ లు దారుణం!
సరిగ్గా ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి విజయ దుందుభి మోగించింది. వైఎస్ఆర్సిపి ని కనీసం సోయిలో లేకుండా చేసింది. 11 స్థానాల వద్ద ఆగిపోయేలా చేసింది. అంత భారీ విజయం సాధించిన నేపథ్యంలో సహజంగానే కూటమి ప్రభుత్వంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమినేతలు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజల్లో వస్తున్న ఆగ్రహాన్ని గమనించిన కూటమి ప్రభుత్వం నెమ్మదిగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలను తిరిగింది. ఈ నియోజకవర్గాలలో తమకు ఎదురైన అనుభవాలను.. ప్రజల మనోభావాలను క్రోడీకరించుకొని కీలకమైన ఫలితాలను వెల్లడించింది.
కేకే సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్లో దాదాపు కూటమి ఎమ్మెల్యేల ఓటు బ్యాంకు 30% తగ్గిందని తెలుస్తోంది.. అయితే ఈ సర్వేలో ఎంతమందిని ప్రామాణికంగా తీసుకున్నారు.. వారి వయసు ఎంత.. ఏ విధమైన ప్రశ్నలు వేశారు.. శాతాన్ని ఎలా లెక్కించారు.. ఇందులో వైసిపి నాయకులకు ఎంత శాతం ప్రజల ఆమోదం ఉంది.. ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది.. కూటమి ఎమ్మెల్యేలు ఏమైనా అక్రమాలకు పాల్పడుతున్నారా.. ఇలాంటి విషయాలను కేకే సర్వే ప్రకటించలేదు.. దీంతో మరోసారి కేకే సర్వే పై చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని కేకే సర్వే అధిపతి ఎదుట ప్రస్తావిస్తే ఆయన త్వరలోనే సమాధానం చెబుతానని ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఈ సర్వే అంత ఆగమాగంగా.. తప్పుల తడకగా నిర్వహించినట్టు అర్థమవుతోందని కూటమి నేతలు అంటున్నారు.. ఇంకా మాకు నాలుగు సంవత్సరాలపాటు పరిపాలన కాలం ఉందని.. ప్రజల అండదండలు కూడా మాకే ఉన్నాయని కూటమి ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ప్రజల ఆమోదం కూడా తమకే ఉందని వివరిస్తున్నారు.