Wimbledon Final : పాతికేళ్లు లేని కుర్రాడు మళ్లీ కొట్టేశాడు.. వింబుల్డన్ ఫైనల్లో పెను సంచలనం

ఈ టోర్నీకి ముందు జకోవిచ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత టోర్నీలో ప్రవేశించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ దాకా వచ్చాడు. తన అడ్డాలో ఈసారి టైటిల్ దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాడు. అయితే అతడిని అల్క రాస్ అడ్డుకున్నాడు. 37 సంవత్సరాల జకోవిచ్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో ఓడించాడు

Written By: Bhaskar, Updated On : July 15, 2024 10:17 am
Follow us on

Wimbledon Final :  వింబుల్డన్ ఫైనల్ పోటీలో పెను సంచలనం నమోదయింది. లండన్ వేదికగా ఆదివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం రాత్రి) జరిగిన ఫైనల్ పోటీలో జకోవిచ్ ఓటమి పాలయ్యాడు..అల్క రాస్ మరోసారి విజేతగా ఆవిర్భవించాడు. 25వ గ్రాండ్ స్లామ్ సాధించాలనే పట్టుదలతో ఉన్న జకోవిచ్ ఆశలపై అల్క రాస్ నీళ్లు చల్లాడు.

తన అడ్డాలో దక్కించుకోలేకపోయాడు

ఈ టోర్నీకి ముందు జకోవిచ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత టోర్నీలో ప్రవేశించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ దాకా వచ్చాడు. తన అడ్డాలో ఈసారి టైటిల్ దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాడు. అయితే అతడిని అల్క రాస్ అడ్డుకున్నాడు. 37 సంవత్సరాల జకోవిచ్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో ఓడించాడు. మొత్తంగా నాలుగో గ్రాండ్ స్లామ్ విజయంతో సరికొత్త చరిత్రను సృష్టించాడు. అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగేందుకు బలంగా అడుగులు వేశాడు.. వాస్తవానికి గత ఏడాది వింబుల్డన్ లో జకోవిచ్ ను ఓడించి అల్క రాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన గెలుపు గాలివాటం కాదని.. ప్రస్తుత విజయంతో నిరూపించాడు.

మూడో సెట్ లో కాస్త ప్రతిఘటన

ప్రస్తుత టెన్నిస్ ర్యాంకింగ్స్ లో మూడో సీడ్ గా అల్క రాస్ కొనసాగుతున్నాడు.. ఆదివారం లండన్ వేదికగా జరిగిన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో పూర్తి ఏకపక్షంగా మార్చాడు..6-2, 6-2, 7-6,(7-4) తేడా తో జకో విచ్ ను మట్టి కరిపించాడు. వాస్తవానికి తొలి రెండు సెట్లలో అల్క రాస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మూడో సెట్ కు వచ్చేసరికి జకోవిచ్ నుంచి
అల్క రాస్ కు ప్రతిఘటన ఎదురయింది. ఈ దశలో మూడవ సెట్ అల్క రాస్ కోల్పోతాడని అందరూ భావించారు. అయితే జకోవిచ్ కు బలంగా అల్క రాస్ ఎదురు నిలబడ్డాడు.

ఒళ్ళును విల్లులాగా వంచాడు

ఈ మ్యాచ్ లో అల్క రాస్ సాటిలేని ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. జకోవిచ్ ఎటువైపు కొట్టినా.. బంతిని అతడు తిరిగి కొట్టగలిగాడు. ఒకరకంగా చెప్పాలంటే రబ్బర్ బంతిలాగా మైదానంలో పరుగులు పెట్టాడు. చిరుతపులి లాగా పరుగులు తీశాడు. ముఖ్యంగా రెండో సెట్ లో తన కాళ్ల మధ్యలో నుంచి బంతి వెళ్ళినప్పుడు.. వెనక్కి పరిగెత్తుతూ.. అదేవిధంగా ముందుకు వచ్చి.. సమర్థవంతమైన షాట్లు ఆడాడు. ఒకరకంగా శరీరాన్ని విల్లు లాగా ఉంచాడు.

కాలికి పట్టి వేయించుకొని..

నెలరోజుల క్రితమే మోకాలికి జకోవిచ్ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. రెండు సెట్లలో తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయినప్పటికీ.. కాలికి పట్టి వేయించుకొని అలానే ఆడాడు.. అయితే బంతిని గట్టిగా బాదడంలో.. నెట్ దగ్గర బంతిని రిటర్న్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఏకాగ్రత కోల్పోయి బంతిని పదేపదే నెట్ కు కొట్టాడు. తన బలమైన ఫోర్ హాండ్ షాట్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయాడు. నెట్ దగ్గర అల్క రాస్ 22 కు గానూ 16 పాయింట్లు సాధించాడు. జకోవిచ్ 53 కు గానూ 27 మాత్రమే దక్కించుకున్నాడు. ఫలితంగా మ్యాచ్ అల్క రాస్ వైపు మొగ్గింది.

హోరాహోరీగా పోరాటం

మొదటి సర్వీస్ పాయింట్లలో అల్క రాస్ సత్తా చాటాడు. తొలి సెట్ లో మొదటి గేమ్ హోరాహోరీగా జరిగింది. ఈ గేమ్ కోసం జకోవిచ్ – అల్క రాస్ హోరాహోరీగా పోరాడారు. ఏడుసార్లు 40-40 పాయింట్లతో సమమయ్యాయి. ఈ దశలో అల్క రాస్ బ్రేక్ పాయింట్ సాధించగలిగాడు. ఐదవ గేమ్ లో మరోసారి ప్రత్యర్థి ఆటగాడు జకో విచ్ సర్వీస్ ను బద్దలు కొట్టాడు. అనంతరం 5-1 తేడాతో దూసుకెళ్లాడు. ఇదే ఉత్సాహంలో తొలి సెట్ కైవతం చేసుకున్నాడు. ఇక రెండవ సెట్ లో అల్క రాస్ కు ఎదురే లేకుండా పోయింది. తొలి గేమ్ లో బ్రేక్ పాయింట్ సాధించిన అల్క రాస్ రెండవ గేమ్ లో మరింత రెచ్చిపోయాడు. జకోవిచ్ ను నెట్ దగ్గరికి రప్పించి చుక్కలు చూపించాడు. ముఖ్యంగా నాలుగో గేమ్ లో కోర్టు బయట నుంచి ఆల్క రాస్ రాకెట్ వేగంతో దూసుకొచ్చి.. నెట్ కింద పడబోతున్న బంతిని గొప్పగా రిటర్న్ చేశాడు. ఈ దృశ్యం ఫైనల్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. చివరికి ఏడో గేమ్ లో మరోసారి బ్రేక్ సాధించి సత్తా చాటాడు. ఆ తర్వాత సెట్ ముగించాడు.

రసవత్తరంగా మార్చాడు

అప్పటివరకు ఏకపక్షంగా సాగుతున్న ఈ మ్యాచ్ ను జకోవిచ్ రసవత్తరంగా మార్చాడు. మూడవ సెట్ లో అద్భుతంగా పుంజుకున్నాడు. అటు అల్క రాస్ కూడా సర్వీస్ నిలబెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి ఆటగాళ్ల స్కోరు 4-4 తో సమానమైంది. అయితే 9వ గేమ్ లో అల్క రాస్ బ్రేక్ పాయింట్ సాధించి లీడ్ లోకి వెళ్ళాడు. ఆ తర్వాత జకోవిచ్ అల్క రాస్ సర్వీస్ ను బ్రేక్ చేశాడు. అయితే మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న అల్క రాస్ గెలుపును కాస్త ఆలస్యం చేశాడు. ఇదే దశలో పోటీని ట్రై బ్రేకర్ వరకు మళ్లించాడు. ఇందులోనూ పై చేయి సాధించాడు. జకోవిచ్ బంతిని నెట్ కు కొట్టగానే..అల్క రాస్ ఒకసారిగా రాకెట్ కింద పడేశాడు.. సింహం లాగా కోర్టులో గర్జన చేశాడు. ఈ మ్యాచ్ లో అల్క రాస్ ఏకంగా ఐదు ఏస్ లు, 42 విన్నర్లు కొట్టడం విశేషం.