Buchi Babu Tournament : ఏడేళ్ల తర్వాత హైదరాబాద్ జట్టు విజేతగా.. బుచ్చిబాబు టోర్నీలో సంచలనం..

దేశవాళి క్రికెట్లో బుచ్చిబాబు టోర్నీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఈ సిరీస్ ఏడు సంవత్సరాలుగా హైదరాబాద్ జట్టుకు అందని ద్రాక్షగా మిగిలింది. ఈసారి మాత్రం లెక్క తప్పలేదు.. బరిలో ముంబై లాంటి పెద్ద జట్టు ఉన్నప్పటికీ.. ట్రోఫీ హైదరాబాద్ జట్టుకు దక్కింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 11, 2024 10:08 pm

Buchi Babu Tournament

Follow us on

Buchi Babu Tournament : ఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ జరిగింది. ఆల్ ఇండియా స్థాయిలో జరిగిన ఈ టోర్నీలో పలు జట్లు పోటీపడ్డాయి. అంతిమంగా హైదరాబాద్ టోర్నీ విజేతగా నిలిచింది. అన్ని రంగాలలో సత్తా చాటి టైటిల్ సొంతం చేసుకుంది. ఛత్తీస్ గడ్ జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 243 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్ జట్టు విధించిన 518 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించేందుకు ఛత్తీస్ గడ్ జట్టు రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. హైదరాబాద్ బౌలర్ల దూకుడుతో ఛత్తీస్ గడ్ జట్టు 274 పరుగులకే చాప చుట్టేసింది. ఓపెనర్ ఆయుష్ పాండే 117 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అతడికి తోడుగా మరో ఓపెనర్ శశాంక్ అర్థ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో స్పిన్నర్ తన్మై త్యాగరాజన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.. మరో స్పిన్నర్ అనికేత్ రెడ్డి రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. రోహిత్ రాయుడు, నితీష్ కన్నా, తన్మయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

ఇక ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 417 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రోహిత్ రాయుడు 155 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓపెనర్ అభిరథ్ 85 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రాహుల్ రాదేశ్ 48 పరుగులతో సత్తా చాటాడు..

అనంతరం హైదరాబాద్ బౌలర్లు రాకెట్ల లాంటి బంతులు విసరడంతో ఛత్తీస్ గడ్ తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అనికేత్ రెడ్డి నాలుగు వికెట్లు పడగొట్టాడు. త్యాగరాజన్ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. రోహిత్ రాయుడు మూడు వికెట్లు సాధించాడు. ఛత్తీస్ గడ్ బ్యాటర్లలో గగన్ దీప్ సింగ్ 59 * పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో హైదరాబాద్ గట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 236 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ఇక రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన హైదరాబాద్ జట్టు 281 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.. రాహుల్ సింగ్ 68 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఛత్తీస్ గడ్ బౌలర్లలో బుట్టే ఆరు వికెట్లతో అలరించాడు..

రంజీ ట్రోఫీ – 2024 ప్లేట్ గ్రూపులో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచిన నేపథ్యంలో.. ఎలైట్ డివిజన్ కు అర్హత పొందింది. బుచ్చిబాబు టోర్నీలో సత్తా చాటి ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపింది. బుచ్చిబాబు టోర్నీలో ముంబై వంటి జట్టు పోటీ పడినప్పటికీ హైదరాబాద్ అద్భుతమైన విజయాలు సాధించింది. వరుస విక్టరీలు సాధించి ఏకంగా ట్రోఫీని దక్కించుకుంది. వచ్చే దేశవాళీ క్రికెట్ టోర్నీ ముందు భారీ విజయం సాధించడంతో హైదరాబాద్ జట్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.