https://oktelugu.com/

Olympics : రాత్రి మొత్తం స్నేహితుడితో ఏకాంతంగా.. ఒలింపిక్స్ నుంచి స్విమ్మర్ ఔట్

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో ఓ లేడీ స్విమ్మర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.. ప్రేమకు నిలయమైన పారిస్ నగరంలో తన స్నేహితుడితో చక్కర్లు కొట్టింది. రాత్రి మొత్తం ఏకాంతంగా గడిపింది.. దీంతో ఆమెను ఒలింపిక్స్ నుంచి బయటికి పంపించేశారు. బ్రెజిల్ దేశానికి చెందిన అనా కరోలినా వియోరా పేరుపొందిన స్విమ్మర్. ఈమె కొంతకాలంగా క్రీడాకారుడైన గాబ్రియల్ శాంటోన్ తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 30, 2024 / 10:16 PM IST
    Follow us on

    Olympics : ఒలింపిక్స్ లో ఆడాలనేది ప్రతి అథ్లెట్ కోరుకుంటారు. విశ్వ వేదికపై నచ్చిన ఆటలో మెచ్చే తీరుగా ప్రతిభ చూపాలని.. మెడల్ సాధించి దేశానికి గొప్ప పేరు తేవాలని భావిస్తుంటారు. ఇందుకోసం అహో రాత్రాలు శ్రమిస్తుంటారు. ఒళ్ళు హూనం చేసుకుంటూ శిక్షణ పొందుతారు. కఠినమైన డైట్ పాటిస్తూ.. చివరికి నోటికి కూడా కళ్లెం వేసుకుంటారు.. ఇంత కష్టపడినా కొందరికి ఒలింపిక్స్ లో ఆడే అవకాశం రాదు. అయితే ఈ క్రీడాకారిణికి తమ దేశం తరఫున ఒలింపిక్స్ లో ఆడే సువర్ణావకాశం వచ్చింది. ఇంకేముంది ఆమె ఎగిరి గంతేసింది. ప్రత్యేక విమానంలో ప్యారిస్ లో లాండ్ అయింది. కానీ ఇక్కడే ఆమె కథ అడ్డం తిరిగింది. ఏ స్థాయిలో అయితే కష్టపడిందో.. ఏ స్థాయిలో అయితే ఇబ్బంది పడిందో.. వాటన్నింటినీ విశ్వ వేదిక మీద ప్రదర్శించడం ముందే తిరుగు టపా కట్టింది. అంతేకాదు పారిస్ వేదికగా తన దేశం పరువు తీసింది.

    రాత్రంతా గడిపిందట

    పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో ఓ లేడీ స్విమ్మర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.. ప్రేమకు నిలయమైన పారిస్ నగరంలో తన స్నేహితుడితో చక్కర్లు కొట్టింది. రాత్రి మొత్తం ఏకాంతంగా గడిపింది.. దీంతో ఆమెను ఒలింపిక్స్ నుంచి బయటికి పంపించేశారు. బ్రెజిల్ దేశానికి చెందిన అనా కరోలినా వియోరా పేరుపొందిన స్విమ్మర్. ఈమె కొంతకాలంగా క్రీడాకారుడైన గాబ్రియల్ శాంటోన్ తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె .. గాబ్రియల్ ను కూడా వెంట తీసుకొచ్చింది. వారిద్దరూ శుక్రవారం రాత్రి బయటికి వెళ్లారు. మరుసటి రోజు పోటీలు జరిగే ప్రదేశానికి వచ్చారు. అయితే ఈ విషయం బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీకి తెలిసింది. వెంటనే ఆమెపై చర్యలు తీసుకుంది. కరోలినా సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్ తో ఈ విషయం బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీకి తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా కరోలినా ప్రవర్తించడాన్ని బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీ తీవ్రంగా తప్పు పట్టింది. ఆమెను టోర్నీ నుంచి వైదొలగాలని స్పష్టం చేసింది. స్వదేశానికి వెంటనే రావాలని ఆదేశాలు జారీ చేసింది.

    గాబ్రియల్ విషయంలో..

    కరోలినా విషయంలో తీవ్రంగా వ్యవహరించిన బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీ.. గాబ్రియల్ విషయంలో కాస్త మెతక వైఖరి అవలంబించింది. తనను క్షమించాలని బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీని గాబ్రియల్ వేడుకోవడంతో.. అతడికి అవకాశం కల్పించింది. ఇక శనివారం జరిగిన పురుషుల 4*100 ప్రీ స్టైల్ హీట్స్ లో గాబ్రియల్ ఓడిపోయాడు. దీంతో బ్రెజిలియన్ స్విమ్మింగ్ కమిటీ స్పందించింది..” ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ పోటీలో పాల్గొనేది స్నేహితురాలితో కలిసి విహారయాత్ర చేసేందుకు కాదు. రాత్రి మొత్తం ఏకాంతంగా గడిపేందుకు అంతకన్నా కాదు. దేశం విజయం కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారిని గెలిపించాలంటే అథ్లెట్స్ అద్భుతంగా ప్రతిభ చూపించాలి. దురదృష్టవశాత్తు కరోలినా నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంది. ఈ విషయాన్ని బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని భావించాం. మేము ఇచ్చే నివేదిక ఆధారంగా వారు తదుపరి చర్యలు తీసుకుంటారు. ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య చర్యలను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. ఎందుకంటే అథ్లెట్ లకు క్రమశిక్షణ చాలా ముఖ్యం. అది లేనివారు ఏ స్థాయిలో రాణించినప్పటికీ పెద్దగా ఉపయోగముండదని” బ్రెజిలియన్ స్విమ్మింగ్ కమిటీ హెడ్ గుత్సావో ఒట్ సుకా పేర్కొన్నారు.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను దుమారాన్ని లేపుతున్నాయి. ఇదే సమయంలో కరోలినా, గాబ్రియల్ వ్యవహార శైలిపై బ్రెజిలియన్ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.