https://oktelugu.com/

Wayanad : అరేబియా వేడెక్కింది.. వయనాడ్ లో జల ప్రళయంలో సృష్టించింది.. ఈ విపత్తు వెనక అసలు కారణాలివీ…

2019లోను కేరళ రాష్ట్రంలో ఇదే స్థాయిలో వరదల సంభవించినప్పుడు కేంద్రం భారీగా సహాయం చేసింది. కేరళ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2024 / 10:08 PM IST

    Wayanad landslide

    Follow us on

    Wayanad : దేవుడి సొంత భూమిగా పేరుపొందిన కేరళ రాష్ట్రం వర్షాలతో విలవిలలాడుతోంది. సరిగ్గా 2019 నాటి పరిస్థితులను మళ్లీ చవిచూస్తోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలు కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. కనివిని ఎరుగని స్థాయిలో పోటెత్తుతున్న వరద గ్రామాలకు గ్రామాలనే ముంచేస్తోంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ప్రకృతి సిద్ధప్రాంతమైన వయనాడ్ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఆకస్మికంగా ముంచెత్తిన వరదల వల్ల కొండ చరియలు విరిగిపడి ఇప్పటికే వందమందికి పైగా ప్రజలు కన్నుమూశారు. అంతకు రెట్టింపు సంఖ్యలో శిధిలాల కింద చిక్కుకుపోయారు. వందలాది మంది ఆచూకీ లభించడం లేదు. వయనాడ్ చరిత్రలో ఈ స్థాయిలో విషాదాన్ని చూడలేదని ఆ ప్రాంతవాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ స్థాయిలో వరదలు రావడానికి ప్రధాన కారణాన్ని నిపుణులు అంచనా వేశారు.

    అందువల్లేనట

    కేరళ రాష్ట్రం అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది. ఈ సముద్రం ఇటీవల తీవ్రంగా వేడెక్కింది. దాని ఉపరితలం పై ఉష్ణోగ్రతలు కనివిని ఎరగని స్థాయిలో పెరిగాయి. అందువల్లే దట్టమైన మేఘాలు స్వల్ప కాలంలో ఏర్పడ్డాయి. అవి కరగడం వల్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసాయి. అందువల్లే విపరీతమైన వరద పోటెత్తింది. దీంతో వయానాడ్ పరిసర ప్రాంతాల్లోని కొండ చరియలు విరిగిపడ్డాయి. వరద వల్ల వయనాడ్ ప్రాంతంలో ఉన్న ఏకైక వంతెన కొట్టుకుపోయింది. భారీగా ఇసుకమేటలు వేయడంతో పంట పొలాలు మొత్తం సర్వనాశనమయ్యాయి. రబ్బర్ తోటలు కొట్టుకుపోయాయి. కొబ్బరి తోటలు నేలకొరిగాయి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీర వంటి తోటల్లో నడుములోతు వరద నీరు నిలిచిపోయింది.

    ముందే గుర్తించారు

    అయితే అరేబియా సముద్ర తీరంలో ఈ స్థాయిలో దట్టమైన మేఘాలు ఏర్పడడాన్ని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారు. ముఖ్యంగా అరేబియా సముద్రంలోని ఆగ్నేయ ప్రాంతం విపరీతంగా వేడెక్కుతోందని.. దీనివల్ల కేరళ రాష్ట్రం మొత్తం ఊష్ణగతి పరంగా అస్థిరంగా మారినట్టు వారు తమ పరిశోధనలో గుర్తించారు. వాతావరణం ఉన్నట్టుండి ఉష్ణగతి పరంగా అస్థిరంగా మారితే విపరీతమైన వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ తరహా వర్షాలు ఉత్తర కొంకణ్ లో ప్రాంతంలో చోటుచేసుకుంటాయని వివరిస్తున్నారు.. 2019 లోను కేరళ రాష్ట్రంలో ఇదే స్థాయిలో వర్షాలు కురిశాయి. దట్టమైన మేఘాలు ఏర్పడి ఊహించని వరదలకు కారణమయ్యాయి. ఆ సమయంలో కేరళ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.

    24 గంటల వ్యవధిలో..

    కేరళలో వయనాడ్ మాత్రమే కాకుండా కొట్టాయం, కాసర గోడ్, కన్నూరు, కొయ్ కోడ్, మలప్పురం వంటి జిల్లాల్లో అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదయింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అనేక జిల్లాల్లో 10 సెంటీమీటర్ల నుంచి వర్షపాతం రికార్డయింది. ఇప్పటికే పలు గ్రామాలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంటలన్నీ సర్వనాశనమయ్యాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. అయితే వయానాడ్ లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. జాతీయ విపత్తు సహాయక దళం సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఇంకా చాలామంది కొండ చరియల శిధిలాల కింద ఉన్నారు. సహాయం కోసం వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. జాతీయ మీడియా కూడా విపరీతంగా ఫోకస్ చేయడంతో.. కేంద్రం వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019లోను కేరళ రాష్ట్రంలో ఇదే స్థాయిలో వరదల సంభవించినప్పుడు కేంద్రం భారీగా సహాయం చేసింది. కేరళ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకుంది.