Border-Gavaskar Trophy: భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ల తర్వాత అంతటి క్రేజ్ ఉన్న సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ. ఈ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 22 నుంచి సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
అధికారిక ప్రకటన..
భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ కోసం ఈ ఏడాది చివరలో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్తుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుతో సిరీస్ ప్రారంభమవుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో జనవరి 7వ తేదీ వరకు అడిలైడ్, బ్రిస్బెన్, మెల్‌బోర్న్, సిడ్నీ నగరాల్లో మిగతా నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా జరుగుతుంది. ఇక ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య జరిగే ఏకైక డే-నైట్ టెస్టు మ్యాచ్ ఇదే. ఇక మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి 18 వరకు బ్రిస్బేన్‌లో జరగనుంది. డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు జరుగుతుంది. సిరీస్‌లో ఇది నాలుగో టెస్టు మ్యాచ్. ఆఖరు టెస్టు 2025, జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.
32 ఏళ్ల తర్వాత మార్పు..
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 32 ఏళ్లుగా జరుగుతోంది. గత సిరీస్ వరకు 4 టెస్టులు ఆడగా, ఈసారి మరో టెస్టు చేర్చారు. దీంతో రెండు జట్లు ఐదు టెస్టుల్లో తపడతాయి. 1991-92 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ – ఆస్ట్రేలియా తలపడడం ఇదే తొలిసారి. ఇక వరల్డ్ టెస్టు ర్యాంకింగ్ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో జరిగే ఈ టెస్ట్ సిరీస్ భారత్‌కు చాలా కీలకమైనది. 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌ను టీమిండియా గెలిచింది. ఇక 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ – ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.