Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడైన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన తో అతను టీం ఇండియాలోకి ఎంట్రీ ఇస్తాడని ఇప్పటికే బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. అయితే గంభీర్ ను హెడ్ కోచ్ గా ప్రకటించిన బీసీసీఐ తొలిసారిగా అతడికి షాక్ ఇచ్చింది . ముందుగా అపరిమితమైన స్వేచ్ఛ ఇస్తామని, టీమిండియాను గెలుపు గుర్రం లాగా మార్చాలని చెప్పిన బీసీసీఐ.. ఆ తర్వాత అతడి సూచనలను, సలహాలను, సిఫార్సులను పక్కన పెడుతోంది. గౌతమ్ గంభీర్ సహాయక సిబ్బంది గా వినయ్ కుమార్, జాంటీ రోడ్స్, డస్కటే ను సిఫారసు చేస్తే.. బీసీసీఐ పెద్దలు వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాలోకి విదేశీ కోచ్ లు వద్దని గౌతమ్ గంభీర్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి టీమ్ ఇండియా కోచ్ గా వచ్చేముందు గౌతమ్ గంభీర్ కొన్ని కండిషన్లు పెట్టాడు. వాటన్నింటికీ బీసీసీఐ పెద్దలు ఒప్పుకున్నారు. ఎలా చెబితే అలా చేస్తామని స్పష్టం చేశారు. దీంతో గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టు మెంటార్ పదవికి రాజీనామా చేసి.. టీమిండియా కోచ్ గా వచ్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో కోచ్ లుగా తాను చెప్పిన వారినే నియమించుకోవాలని అప్పట్లోనే కోరాడు. అయితే బీసీసీఐ పెద్దలు దానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా వచ్చాడు. అతని నియామకం పూర్తయిన తర్వాత ఇప్పుడు బీసీసీఐ షాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ల నియామకంపై గౌతమ్ గంభీర్ చేసిన సిఫారసులను బీసీసీఐ బుట్ట దాఖలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో తొలిసారిగా గౌతమ్ గంభీర్ కు ప్రతిబంధకం ఎదురైనట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్ గా జాంటీ రోడ్స్ కు పేరుంది. అయితే అతడిని ఫీల్డింగ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ సిఫారసు చేశాడు. జాంటీ రోడ్స్ తో కలిసి ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్ లక్నో జట్టు కోసం పనిచేశాడు. అయితే అతడి సేవలను టీమిండియా కూడా ఉపయోగించుకోవాలని గౌతమ్ గంభీర్ అనుకున్నాడు. అయితే గౌతమ్ గంభీర్ ప్రతిపాదనను బీసీసీఐ తోసిపుచ్చింది.. టీమిండియా సహాయక శిక్షకులుగా భారతీయులను మాత్రమే నియమించాలని.. అందువల్లే గౌతమ్ గంభీర్ ప్రతిపాదనను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని బీసీసీఐ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మాత్రమే కాదు, బిసిసిఐ గత ఏడు సంవత్సరాలుగా ఇదే పద్ధతిని పాటిస్తోంది. ఆటగాళ్లకు, శిక్షకులకు భాషాపరమైన సమస్య లేకుండా ఈ నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలు గతంలోనే తీసుకున్నారు. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్ పేరును బౌలింగ్ కోచ్ స్థానానికి గంభీర్ సిఫారసు చేశాడు. అయితే దానిని కూడా బీసీసీఐ తిరస్కరించింది. వినయ్ కుమార్ కంటే ముందు జహీర్ ఖాన్ లేదా లక్ష్మీపతి బాలాజీలో ఎవరో ఒకరిని బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
నెదర్లాండ్స్ జట్టుకు చెందిన డస్కాటే ను సహాయక కోచింగ్ బృందంలోకి తీసుకోవాలని గంభీర్ భావించాడు. అయితే ఆ ప్రతిపాదనను కూడా బీసీసీఐ ఒప్పుకోలేదు. ఇలా వరుసగా గంభీర్ చేసిన మూడు సిఫారసులను బీసీసీఐ పెద్దలు పోవడంతో జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలే ముక్కుసూటి మనిషిగా పేరుపొందిన గౌతమ్ గంభీర్.. టీమిండియా కోచ్ గా పూర్తిస్థాయిలో కొనసాగుతాడా? లేకుంటే విభేదాలను సాకుగా చూపి మధ్యలోనే వైదొలుగుతాడా అనేది.. మరి కొద్ది రోజుల్లో తేలుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.