https://oktelugu.com/

BCCI – R Ashwin : అశ్విన్ అర్ధాంతరంగా వెళ్ళినప్పుడు బీసీసీఐ ఏం చేసింది..

ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే అప్పటికప్పుడు రవిచంద్రన్ అశ్విన్ చెన్నై వెళ్లారని.. తన మాతృమూర్తిని పరామర్శించారని గుర్తు చేస్తున్నారు. జై షా అలాంటి నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2024 / 11:48 PM IST
    Follow us on

    BCCI – R Ashwin : మూడో టెస్టులో అర్థంతరంగా జట్టు నుంచి వెళ్లిపోయిన భారత ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యవహారంపై రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండవ రోజు 500 వికెట్ల ఘనత సాధించిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మాత్తుగా జట్టు నుంచి వెళ్లిపోయాడు. అతడు అలా వెళ్ళిపోవడం వెనక ఏం జరిగి ఉంటుందో తెలియక చాలామంది ఆందోళన చెందారు. తన మాతృమూర్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అశ్విన్ వెంటనే రాజ్ కోట్ నుంచి వెళ్ళిపోయాడని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అశ్విన్ అండ అతని కుటుంబానికి ఎంతో అవసరమని బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో అతడు చెన్నై చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ ఆ ఏర్పాట్లే ఇప్పుడు చర్చనీయాశంగా మారాయి.

    భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్లకు ఏమైనా అయితే బీసీసీఐ వెంటనే స్పందిస్తుంది. ఆటగాళ్లకు అందించే ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయదు. క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటుంది. అశ్విన్ విషయంలోనూ బీసీసీఐ తన మానవత్వాన్ని చాటుకుంది. అప్పటికప్పుడు రవిచంద్రన్ అశ్విన్ చెన్నై వెళ్లేందుకు చార్టెడ్ ఫ్లైట్ సమకూర్చింది. దీంతో అతడు గంటల వ్యవధిలోనే చెన్నై చేరుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన మాతృమూర్తిని పరామర్శించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు అండగా ఉన్నాడు. ఆ తర్వాత ఆదివారం మళ్లీ రాజ్ కోట్ వచ్చాడు. టీ బ్రేక్ టైమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో అశ్విన్ మూడో రోజు గైర్హాజరైనందుకు ఐసీసీ ఎలాంటి అపరాధ రుసుం విధించలేదు. ఐసీసీ నిబంధన ప్రకారం పూర్తి ఆమోదయోగ్యమైన కారణాల వల్ల ఆటగాడు మైదానాన్ని విడిచిపెడితే.. ఒక ఆటగాడిని సబ్ స్టిట్యూట్ గా నియమించాలి. అప్పుడు అతడికి అపరాధ రుసుం విధించరు. అయితే ఇందులో అనారోగ్యం లేదా అంతర్గత గాయం ఉండకూడదని ఐసీసీ నిబంధన 24.3.2 చెబుతోంది..

    రవిచంద్రన్ అశ్విన్ కు బీసీసీఐ చార్టెడ్ ఫ్లైట్ సమకూర్చడం పట్ల మాజీ ఆటగాడు రవి శాస్త్రి స్పందించారు. క్లిష్ట సమయంలో రవిచంద్రన్ అశ్విన్ కు అండగా ఉన్న బీసీసీఐకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బిసిసిఐ కార్యదర్శి జై షా అప్పటికప్పుడు స్పందించడం వల్లే ఇదంతా జరిగిందని కొనియాడారు. ఆటగాళ్లకు బీసీసీఐ ఎప్పుడూ ఇలాగే సహకరించాలని ఆయన కోరారు. ఆటగాళ్లకు అలా సహకరిస్తేనే మేనేజ్మెంట్ పై నమ్మకం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చూసిన నెట్టిజన్లు బిసిసిఐ సెక్రెటరీ జై షా ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే అప్పటికప్పుడు రవిచంద్రన్ అశ్విన్ చెన్నై వెళ్లారని.. తన మాతృమూర్తిని పరామర్శించారని గుర్తు చేస్తున్నారు. జై షా అలాంటి నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.