IND Vs ENG Series : ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ (Boarder Gavaskar) ట్రోఫీని కోల్పోయిన నేపథ్యంలో టీమిండియా (Team India) పై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన వరుస ఓటముల నుంచి ఉపశమనం పొందాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టి20, వన్డే సిరీస్ గెలవాలని యోచిస్తోంది. అయితే జట్టుకూర్పు విషయంలో ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్ కసరత్తు మొదలుపెట్టింది. దీనికంటే ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కు దూరంగా ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వారిద్దరు కూడా జట్టులో ఉంటారని.. వన్డే సిరీస్ లో ఇద్దరూ ఆడతారని టీమిండియా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల టి20 లకు రోహిత్, విరాట్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టి20 వరల్డ్ కప్ ను టీమ్ ఇండియా గెలిచిన తర్వాత.. వారిద్దరు పొట్టి ఫార్మాట్ కు శాశ్వత విశ్రాంతి పలికారు. అయితే కొంతకాలంగా సరైన ఫామ్ లో లేకపోవడం.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లలో వీరిద్దరూ దారుణంగా విఫలం కావడంతో.. పూర్వపు లయను అందుకోవడానికి వీరిద్దరూ తెగ ప్రయత్నిస్తున్నారు. అందువల్లే ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సిరీస్ లో రాణించాలని భావిస్తున్నారు.
బుమ్రా కు రెస్ట్
ఈ సిరీస్లో టీమిండియా స్పీడ్ గన్ బుమ్రా కు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. కొంతకాలంగా బుమ్రా విపరీతంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఏమాత్రం రెస్ట్ లేకుండా సిరీస్ లలో పాలుపంచుకుంటున్నాడు. దీంతో అతడికి ఇంగ్లాండ్ సిరీస్ లో రెస్ట్ ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అతడి స్థానంలో కొత్త బౌలర్లకు అవకాశం ఇవ్వనుంది. మరోవైపు ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ ద్వారా మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వీరు టి20 తో పాటు వన్డే టోర్నీ కూడా ఆడతారు. అయితే టి20 లలో దక్షిణాఫ్రికా తో జరిగిన సిరీస్లో విజయం సాధించిన జట్టునే.. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లోనూ ఆడించాలని టీం ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.. ఇందులో ప్రతిభ చూపిన ఆటగాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాన్ని కల్పించనుంది. టీమిండియా యువ ఆటగాళ్లు కొంతకాలంగా స్థిరమైన ప్రదర్శన చేస్తున్నారు. ఒకరు కాకపోతే మరొకరు రెచ్చిపోయి ఆడుతున్నారు. అంతిమంగా జట్టుకు విజయాలతో పాటు ట్రోఫీలను కూడా అందిస్తున్నారు. అందువల్ల టీమిండియా టి20 వరల్డ్ కప్ తర్వాత ఇంతవరకు ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు.. పైగా విదేశాలలోనూ టీమిండియా అదరగొడుతోంది.. ఛాంపియన్ గా ఆవిర్భవిస్తోంది.