BCCI: టి20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలో కోచ్ పదవిలో లక్ష్మణ్ ను నియమించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. నెటిజన్లు అనుహ్యంగా లక్ష్మణ్ పేరును ప్రస్తావించారు. టీమిండియా కోచ్ గా లక్ష్మణ్ ను నియమించాలని సోషల్ మీడియాను హోరెత్తించారు. బీసీసీఐ, జై షా ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెట్టారు. ప్రస్తుతం లక్ష్మణ్ అండర్ – 19 జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
లక్ష్మణ్ పేరు ప్రస్తావనలో ఉండగానే.. రాహుల్ ద్రావిడ్ కూడా మరోసారి కోచ్ పదవి కోసం దరఖాస్తు చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాహుల్ ద్రావిడ్ కు కోచ్ పదవిలో కొనసాగింపు లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు కూడా. అయితే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసే విషయమై రాహుల్ ద్రావిడ్ ఇంతవరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ టి20 వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగుస్తుంది. అటు లక్ష్మణ్, ఇటు ద్రావిడ్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. తెరపైకి మరో దిగ్గజ ఆటగాడి పేరు వచ్చింది.
రాహుల్ ద్రావిడ్ తర్వాత అతడి వారసుడిగా ఒకప్పటి న్యూజిలాండ్ జట్టు దిగ్గజ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితేనే బాగుంటుందని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు స్టీఫెన్ ఫ్లెమింగ్ తో చర్చలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్లెమింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతడి ఆధ్వర్యంలో చెన్నై ఆటగాళ్లు అద్భుతమైన నైపుణ్యాన్ని సంపాదించారు. పైగా ఫ్లెమింగ్ కు విశేషమైన అనుభవం ఉంది. చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా ఆవిర్భవించడంలో ఫ్లెమింగ్ పాత్ర కీలకమైనది.
అయితే ఫ్లెమింగ్ బీసీసీఐ షరతులకు ఒప్పుకుంటాడా? అనేది తేలాల్సి ఉంది. టీమిండియాను అతడు మూడు ఫార్మాట్స్ లో ముందుకు నడిపించాలి. ఏడాదిలో పది నెలలపాటు అతడు జట్టుతోనే కొనసాగాలి. ఒకవేళ అతడు టీమిండియా కు శిక్షకుడిగా ఎంపిక అయితే చెన్నై జట్టుతో ఉన్న అనుబంధాన్ని తెంపుకోవాలి.. ఫ్లెమింగ్ మాత్రమే కాకుండా జస్టిన్ లాంగర్ కూడా టీమిండియా శిక్షకుడి రేసులో ఉన్నాడు.. ఇక టీమ్ ఇండియాకు చివరి విదేశీ కోచ్ గా ప్లెచర్ వ్యవహరించాడు.