YCP: వైసీపీలో ఆ లోటు కనిపిస్తోంది!

గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి మెజారిటీ తమకే దక్కుతుందని.. సంక్షేమ పథకాలపై సంతృప్తి కనిపిస్తోందని.. అవి ఓట్లుగా మారుతాయని వైసిపి భావించింది. కానీ సంక్షేమ పథకాలు అందుకున్నందు వల్లే.. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు తెరవ లేకపోయారు.

Written By: Dharma, Updated On : May 15, 2024 1:35 pm

YCP

Follow us on

YCP: గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైసిపి విజయం సాధించింది. 151 స్థానాలతో బంపర్ విక్టరీ కొట్టింది. నాటి ఎన్నికల్లో వైసీపీ ఆత్మవిశ్వాసం ముందు.. అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం కనీస స్థాయిలో కూడా నిలబడలేకపోయింది. అదే ఆ పార్టీకి విజయం సాధించి పెట్టింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. గత ఎన్నికల్లో వ్యక్తమైన విశ్వాసం, కాన్ఫిడెన్స్ వైసీపీలో కనిపించలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి మెజారిటీ తమకే దక్కుతుందని.. సంక్షేమ పథకాలపై సంతృప్తి కనిపిస్తోందని.. అవి ఓట్లుగా మారుతాయని వైసిపి భావించింది. కానీ సంక్షేమ పథకాలు అందుకున్నందు వల్లే.. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు తెరవ లేకపోయారు. ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఉన్నవారు సైతం.. బహిరంగంగా వ్యక్తపరచలేదు. దీంతో వారంతా తమ వారేనని వైసీపీ భావించింది. అయితే అది పోలింగ్ కు ముందు తేలిపోయింది. ప్రజల్లో ఒక రకమైన చేంజ్ కనిపించింది. కూటమికి పాజిటివ్ మూడ్ వ్యక్తం అయింది. అదే వైసీపీకి ప్రతికూలంగా మారింది.

2019లో టిడిపి ఎదుర్కొన్న పరిస్థితినే ఇప్పుడు వైసీపీ ఫేస్ చేస్తోంది. నాడు ఎన్నికలకు ముందే టీడీపీ చేతులెత్తేసింది. అయితే ఈ విషయంలో వైసీపీ పరిస్థితి కాస్త బెటర్ గానే ఉంది. పోలింగ్ వరకు ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకాన్ని క్యాడర్లో కల్పించారు. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత అసలు ఏమీ లేదన్నట్టుగా వైసీపీ నేతలు భావించారు. మంత్రి రోజా లాంటి వారు అయితే సొంత పార్టీ వారే తనను ఓడించేందుకు సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు ఈసీ కూటమికి సహకరించిందని.. తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని చెప్పడం ద్వారా.. ఓటమి భయాన్ని బయటపెట్టేశారు. అటు తెలుగుదేశం కూటమిలో ఎనలేని ధీమా ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లోఒక రకమైన ధైర్యం కనిపిస్తోంది. వైసీపీలో మాత్రం అటువంటిదేమీ కనిపించకపోవడం ఆ పార్టీకి లోటు.