BCCI India:క్రికెట్ ఇంగ్లీష్ దేశంలో పుట్టింది. ఆస్ట్రేలియా లో ఎదిగింది. టీమిండియా ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకుంది.. కమర్షియల్ గా అంతకంతకు విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడుతున్న దేశాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి..లీగ్ మ్యాచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండరీ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. లీగ్ మ్యాచ్లలో ఆడుతూ సత్తా చాటుతున్నారు.
ప్రపంచ క్రికెట్ పై భారత్ తిరుగులేని ముద్ర వేసింది. జెంటిల్మెన్ క్రికెట్ కు కాసులను పరిచయం చేసింది. బిసిసిఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ రిచ్ క్రికెట్ లీగ్ గా అవతరించింది. ఐపీఎల్ బ్రాండ్ విలువ ఏకంగా లక్ష కోట్లను దాటింది అంటే బీసీసీఐ ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఐపీఎల్ ద్వారా మన దేశానికి సంబంధించిన క్రికెటర్లు మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే ఇతర దేశాల క్రికెటర్లకు విపరీతమైన ఆదాయం లభిస్తున్నది. అందువల్లే ఇతర దేశాల్లో చెందిన క్రికెటర్లు తమ జాతీయ జట్లకు ఆడే మ్యాచ్లను పక్కనపెట్టి మరీ ఐపీఎల్ ఆడేందుకు వస్తున్నారు. కేవలం ఐపిఎల్ మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి కి భారత క్రికెట్ నియంత్రణ మండలి ద్వారానే అధికంగా ఆదాయం సమకూరుతోంది. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మండలికి అధ్యక్షుడిగా జై షా కొనసాగుతున్నారు. ఈయన గతంలో భారత క్రికెట్ నియంత్రణ మండలికి కార్యదర్శిగా పనిచేశారు.
క్రికెట్ మీద పెత్తనం పక్కన పెడితే.. క్రికెట్ నిర్వహిస్తున్న తీరుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ను లార్డ్స్ లో నిర్వహించారు. ఈ మైదానం చూసేందుకు అద్భుతంగా ఉంది.. మ్యాచ్ నిర్వహించిన తీరు కూడా అనితర సాధ్యంగా ఉంది. మైదానంలో పచ్చిక చూడచక్కగా కనిపించింది. మైదానం చుట్టూ నిర్మించిన భవనాలు.. క్యాంటీన్.. గ్యాలరీ.. డ్రెస్సింగ్ రూమ్.. ఇలా ప్రతి ఒక్కటీ శోభాయ మానంగా దర్శనమిచ్చాయి. ఎప్పుడైతే లార్డ్స్ మైదానం గురించి సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల అయ్యాయో.. ట్రోలర్స్ భారత క్రికెట్ నియంత్రణ మండలి బాధ్యులపై విమర్శలు మొదలుపెట్టారు. ” జెంటిల్మెన్ గేమ్ ను ఇలా నిర్వహించాలి. కానీ మీరేమో పూర్తి కమర్షియల్ గా మార్చేశారు. కూర్చునే సీట్ల దగ్గర నుంచి మొదలు పెడితే.. గ్యాలరీ వరకు అన్నిట్లోనూ కమర్షియల్ కోణం చూస్తున్నారు. చివరికి పాన్ మసాలా యాడ్స్ ను కూడా వదిలిపెట్టడం లేదు. అందువల్లే అభిమానులకు క్రికెట్ మజా దూరమవుతున్నదని” అభిమానులు వ్యాఖ్యానించారు. అప్పట్లో లార్డ్స్ మైదానాన్ని, భారత్లోని ఢిల్లీ మైదానాన్ని పోల్చి చెబుతూ ట్రోలర్స్ చేసిన విమర్శలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.
ఇక ప్రస్తుతం కంగారు జట్టు, వెస్టిండీస్ జెట్ టెస్ట్ సీరీస్ ఆడుతున్నాయి. వెస్టిండీస్ వేదికగా ఈ సిరీస్ నడుస్తోంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ బార్బోడోస్ లో జరిగింది. బార్బోడోస్ మైదానం విశాలంగా ఉంది. అభిమానులు మ్యాచ్ చూసేందుకు అనువైన వాతావరణం కూడా ఉంది. పైగా బీచ్ మాదిరిగా అక్కడ అభిమానుల కోసం ఏర్పాటు చేశారు. ఈ మైదానం సముద్రం తీరంలో ఉంటుంది. ఇప్పుడు ఈ మైదానాన్ని, లార్డ్స్ మైదానాన్ని పక్క పక్కన పెట్టి.. ఆ రెండింటితో ఢిల్లీ మైదానాన్ని కొంతమంది నెటిజన్లు పోల్చి చూస్తున్నారు. అంతేకాదు ఆటను ఆటగా చూసిన దేశాల్లో మైదానాలు ఇలా ఉంటే.. కమర్షియల్ గా చూస్తున్న భారత దేశంలో మైదానం ఇలా ఉందంటూ చురకలు అంటిస్తున్నారు.