BCCI announces cash reward for Team India: వరుసగా రెండవసారి.. ఓవరాల్ గా మూడవసారి టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా మీద భారత క్రికెట్ నియంత్రణ మండలి కనక వర్షం కురిపించింది.. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును ఓడించి.. టీమిండియా టి20 వరల్డ్ కప్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2024 లో కూడా టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. 2007 ప్రారంభ సంవత్సరంలో టి20 వరల్డ్ కప్ అందుకుంది.
వరుసగా రెండుసార్లు.. మొత్తంగా మూడుసార్లు టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో మేనేజ్మెంట్ ఎటువంటి నగదు బహుమతి అందిస్తుందోనని అందరిలోనూ ఒక రకమైన ఉత్కంఠ ఏర్పడింది. ఈ ఉత్కంఠకు మంగళవారం బిసిసిఐ తెరదించింది.. టి20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియా ప్లేయర్లకు మొత్తం 131 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది. 131 కోట్ల నగదును ఆటగాళ్లకు..కోచ్, సహాయక సిబ్బందికి ఎలా పంచుతారనేది చూడాల్సి ఉంది..
రోహిత్ నాయకత్వంలో టీమిండియా 2024లో టి20 వరల్డ్ కప్ సొంతం చేస్తుంది. ఆ సమయంలో బిసిసిఐ 125 కోట్లను నగదు బహుమతిగా ప్రకటించింది. 2026 లో కూడా టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో ఈసారి మరో ఆరు కోట్లను పెంచి మొత్తంగా 131 కోట్లను నగదు బహుమతిగా ప్రకటించింది. భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో ఐసిసి 21.5 కోట్లను నగదు బహుమతిగా ప్రకటించింది. ఇక రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు ఐసిసి 10.75 కోట్లను అందించింది.
ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ విఫలమైనప్పటికీ.. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు చేశారు. టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ స్కోరును చేదించడంలో న్యూజిలాండ్ ప్రారంభం నుంచి తడబడింది. చివరికి టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు ద్వారా వరుసగా రెండవసారి టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా.. మొత్తంగా మూడుసార్లు పొట్టి ప్రపంచ కప్ అందుకొని మిగతా జట్లకు అందనంత ఎత్తులో నిలిచింది.