PAK vs BAN : బంగ్లాదేశ్ లో ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ ఏమాత్రం శాంతిభద్రతలు అదుపులోకి రాలేదు. పైగా అక్కడ రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవి రాజీనామా చేసి.. భారత్ పారిపోయిన సమయంలో ఆందోళనకారులు బంగ్లాదేశ్ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. వారి ఇళ్లను దహనం చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో బతుకు జీవుడా అనుకుంటూ బంగ్లాదేశ్ క్రికెటర్లు తలా ఒక దిక్కుకు పారిపోయారు. అయితే అలాంటి జట్టు ఆటగాళ్లు మళ్లీ క్రికెట్ ఆడతారని ఎవరూ ఊహించలేదు. అయితే అంతటి కల్లోల పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా బంగ్లా ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. పాకిస్తాన్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడారు. పాకిస్థాన్ ను సొంత దేశంలో 2-0 తేడాతో ఓడించారు. తొలిసారి పాకిస్తాన్ జట్టుపై పది వికెట్ల తేడాతో విజయం సాధించడం మాత్రమే కాదు.. 2-0 తేడాతో సిరీస్ దక్కించుకున్నారు. ఫలితంగా సరికొత్త చరిత్రను సృష్టించారు.
పాక్ పై ఇదే తొలిసారి
బంగ్లాదేశ్ జట్టు క్లీన్ స్వీప్ విజయాలు సాధించడం ఇదే తొలిసారి కాదు. 2009లో వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. ఆ విజయం బంగ్లాదేశ్ టెస్ట్ చరిత్రలో తొలి క్లిన్ స్వీప్ విక్టరీ. ఆ తర్వాత 2021లో జింబాబ్వే జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ ను 1-0 తేడాతో విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు 2024 లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ 2-0 తేడాతో దక్కించుకుంది. బంగ్లాదేశ్ సాధించిన ఈ విజయాలు మొత్తం విదేశాల్లోనే కావడం విశేషం. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పాకిస్తాన్ జట్టును వారి సొంత దేశంలో పద వికెట్ల తేడాతో ఓడించిన ఘనతను మాత్రం బంగ్లాదేశ్ జట్టు తన పేరు మీద లిఖించుకుంది. ఈ విజయంతో బంగ్లా జట్టు పై అభినందనలు జల్లు కురుస్తోంది. దేశంలో అంత కల్లోలం నెలకొన్నప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లు స్పూర్తివంతమైన ఆట తీరును ప్రదర్శించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇదే ఆట తీరును వచ్చే రోజుల్లోనూ కొనసాగించి.. జట్టుకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. పాకిస్తాన్ పై 2-0 తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ జట్టు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పాక్ పై క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో బంగ్లా ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.