BAN v AFG : పసికూనలు కావివీ.. కసికూనలు

లి మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించడంతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు బరిలోకి దిగింది. ఇరుజట్లు హోరాహోరీగా పోరాడినప్పటికీ బంగ్లాదేశ్ జట్టును విజయం వరించింది.

Written By: NARESH, Updated On : July 17, 2023 8:36 pm
Follow us on

BAN v AFG : బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు క్రికెట్ లో పసికూనలుగా కనిపిస్తాయి. ఈ రెండు జట్ల మధ్య సిరీస్ అంటే ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు అంతా భావిస్తారు. కానీ, అందుకు విరుద్ధంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన టి20 సిరీస్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఇరుజట్లు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించడంతో చివరి టి20 మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఈ రెండు జట్ల పోరాటాన్ని చూసిన క్రికెట్ అభిమానులు పసికూనలేగాని కసికూనలు అంటూ కొనియాడుతున్నారు.

ఆఫ్గనిస్తాన్ జట్టు జూన్ 14 నుంచి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళింది. ఈ పర్యటనలో భాగంగా ఒక టెస్టు, మూడు వన్డేలతోపాటు రెండు టీ20 మ్యాచ్ లు ఆడింది. వన్డే సిరీస్ ను ఆఫ్ఘనిస్తాన్ జట్టు దక్కించుకోగా, టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. టి20 మ్యాచ్ల సిరీస్ ఈనెల 14న ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించడంతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు బరిలోకి దిగింది. ఇరుజట్లు హోరాహోరీగా పోరాడినప్పటికీ బంగ్లాదేశ్ జట్టును విజయం వరించింది. డక్వర్త్ లూయిస్ విధానంలో బంగ్లాదేశ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకోవడం ద్వారా ఈ సిరీస్ ను కైవసం చేసుకుంది.

హోరాహోరీగా తలపడిన ఇరు జట్లు..

క్రికెట్లో ఒకరకంగా చూస్తే ఈ రెండు జట్లను పసికూనలుగా అభిమానులు భావిస్తారు. కానీ ఈ రెండు జట్ల ఆటగాళ్ల పోరాటపటిమ మాత్రం అద్భుతం అనే చెప్పాలి. ఇరు జట్లు ఆటగాళ్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించడంతో రెండో టి20 మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్లు గుర్బాజ్, హజ్రతుల్లా జజాయ్ విఫలమయ్యారు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఆఫ్గానిస్థాన్ జట్టును ఇబ్రహీం జర్దాన్ 22(27), మహమ్మద్ నబీ 16(22) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా 25(21), కరీం జనాత్ 20(15) రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగలిగింది ఆఫ్గనిస్తాన్ జట్టు. వర్షం పడటంతో ఈ మ్యాచ్ ను 17 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు మెరుగైన ఆరంభం లభించింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు లిటన్ దాస్ 35(36), ఆఫీఫ్ హుస్సేన్ 24(20) రాణించడంతో తొలి వికెట్ కు 9 ఓవర్లలో 67 పరుగుల భాగస్వామ్యం లభించింది. రెండు పరుగులు వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయి బంగ్లాదేశ్ జట్టు ఒత్తిడికి గురైనట్లు కనిపించినా.. హ్రిదోయ్ 19(17), షకీబుల్ హాసన్ 18 (11), షమీం హుస్సేన్ 7(7) రాణించడంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు పోరాటపటిమ చూపించడంతో మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. ముఖ్యంగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్యాటింగ్ బౌలింగ్ చేసిన విధానం అభిమానులను ఎంతగానో అలరించింది.