BAN Vs NZ: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టుపై న్యూజిలాండ్ (NZ vs BAN) ఘన విజయం సాధించింది. గ్రూప్ – ఏ లో ఉన్న న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించి సెమీఫైనల్ వెళ్ళింది.. అయితే న్యూజిలాండ్ విజయం సాధించిన నేపథ్యంలో గ్రూప్ ఏ నుంచి భారత్ కూడా సెమిస్ వెళ్ళిపోయింది. ఇక ఆతిధ్య పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
రావల్పిండి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. కెప్టెన్ షాంటో (77), జాకీర్ అలీ(45) మాత్రమే రాణించారు. వీరిద్దరు గనక లేకుంటే బంగ్లాదేశ్ స్కోరు మరింత దారుణంగా ఉండేది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్ వెల్ 4, ఓ రూర్కే 2 వికెట్లు పడగొట్టారు.. ప్రారంభంలో కాస్త దూకుడుగా ఆడిన బంగ్లాదేశ్ జట్టు.. తర్వాత తేలిపోయింది. న్యూజిలాండ్ బౌలర్ల ముందు వణికిపోయింది. ఓపెనర్ తాంజిద్ హసన్ (24) ఒక ఫోర్, రెండు సిక్సర్లు కొట్టి ఊపు మీద కనిపించినప్పటికీ.. అదే జోరు కొనసాగించలేకపోయాడు. ఒకవేళ అతడు గనుక నిలబడి ఉంటే బంగ్లాదేశ్ స్కోరు భారీగానే ఉండేది. న్యూజిలాండ్ ఎదుట టైట్ టార్గెట్ విధించేది. అతడు అవుట్ కావడంతో బంగ్లాదేశ్ పరిస్థితి ఒక్కసారిగా తారు మారయింది. శాంటో, జాకీర్ అలీ మినహా మిగతా ఆటగాళ్లు తేలిపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేక పోయింది. ప్లాట్ మైదానంపై న్యూజిలాండ్ బౌలర్లు పండగ చేసుకున్నారు. కట్టుదిట్టంగా బంతులు వేసి బంగ్లాదేశ్ జట్టుకు చుక్కలు చూపించారు.
రచిన్ రవీంద్ర ఆదుకున్నాడు
237 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. భీకరమైన ఫామ్ లో ఉన్న విల్ యంగ్(0) తొలి ఓవర్ చివరి బంతికి తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాన్వే(30), విలియంసన్ (5) త్వర త్వరగా గానే అవుట్ కావడంతో న్యూజిలాండ్ 72 పరుగులపై 3 వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ సంచలనం సాధించే లాగా కనిపించింది. ఈ దశలో వచ్చిన రచిన్ రవీంద్ర (112), లాథం (55) న్యూజిలాండ్ జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, లాథమ్ అవుట్ అయినప్పటికీ.. న్యూజిలాండ్ జట్టుకు పెద్దగా నష్టం వాటిల్ల లేదు. తదుపరిగా వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (21) బ్రేస్ వెల్(11) మిగతా లాంచనాన్ని పూర్తి చేశారు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్లో తలకు గాయమై ఇబ్బంది పడిన రచిన్ రవీంద్ర బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అందుబాటులోకి వచ్చాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్..బంగ్లా అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టయింది. గ్రూప్ – ఏ నుంచి భారత్ – న్యూజిలాండ్ సెమీఫైనల్ వెళ్లాయి.. గ్రూప్ బి లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆడిన ఒక్కో మ్యాచ్లో విజయం సాధించాయి. ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఒక్కో మ్యాచ్ ఓడిపోయాయి. తదుపరి మ్యాచ్లో గెలుపులు ఆధారంగానే మిగతా జట్ల భవితవ్యాలు ఆధారపడి ఉంటాయి.