AUS Vs NZ: రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో వెల్డింగ్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 383 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ 174(23 ఫోర్లు, 5 సిక్స్ లు) పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. రెండో రోజు అతడు న్యూజిలాండ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఫాస్ట్, స్పిన్.. ఇలా ఏ బౌలర్ నూ అతడు వదిలిపెట్టలేదు. చివరి వికెట్ అయినప్పటికీ బౌలర్ హజిల్ ఉడ్ తో కలిసి గ్రీన్ 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో చివరి వికెట్ కు నెలకొల్పిన భాగస్వామ్యమే అత్యుత్తమమైనది కావడం విశేషం.
తొమ్మిది వికెట్ల నష్టానికి 279 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆస్ట్రేలియా శుక్రవారం బ్యాటింగ్ ప్రారంభించింది. ఆస్ట్రేలియా త్వరగానే ఈ వికెట్ కోల్పోయి ఆల్ అవుట్ అవుతుందని అందరూ భావించారు. కానీ వారందరి అంచనాలను గ్రీన్ తలకిందులు చేశాడు. 103 పరుగులతో రెండవ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన అతడు.. న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్స్ లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు.. ఈ దశలోనే 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 175 కు ఒక్క పరుగు దూరంలో ఉండగా హజిల్ వుడ్ అవుట్ అయ్యాడు. లేకుంటే డబుల్ సెంచరీ చేసేవాడేమో. ఈ జోడిని విడదీయడానికి న్యూజిలాండ్ కెప్టెన్ ఏకంగా ఐదుగురు బౌలర్లను ప్రయోగించాల్సి వచ్చింది. చివరి వికెట్ కు 116 పరుగులు జోడించారంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే చివరి వికెట్ కు ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు గతంలో అనేక రికార్డులు నెలకొల్పారు. ఇంగ్లాండ్ జట్టుపై 2013 జూలైలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అగర్, హ్యుజ్ చివరి వికెట్ కు 163 పరుగులు జోడించారు.. ఇప్పటివరకు వీరు నెలకొల్పిన భాగస్వామ్యం ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమంగా ఉంది.. 1924 డిసెంబర్ లో ఇంగ్లాండ్ జట్టుపై జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్లు మెయిలీ, టైలర్ చివరి వికెట్ కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. 1902 జనవరిలో ఇంగ్లాండ్ జట్టు పై జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆర్మ్ స్ట్రాంగ్, డఫ్ చివరి వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. 2024 మార్చిలో న్యూజిలాండ్ జట్టుపై జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్రీన్, హజిల్ ఉడ్ చివరి వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. 2004 నవంబర్ నెలలో న్యూజిలాండ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్లు మెక్ గ్రాత్, గిలెస్పీ 114 పరుగుల భాగస్వామ్యాన్ని చివరి వికెట్ కు నెలకొల్పారు. ఇక డిసెంబర్ 2005లో సౌత్ ఆఫ్రికా జట్టుపై హస్సి, మెక్ గ్రాత్ జోడి చివరి వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది..
కాగా, ఇప్పటికే మూడు టి20 లో సిరీస్ ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు.. ఈ టెస్ట్ సిరీస్ ఎలాగైనా దక్కించుకోవాలని బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 383 పరుగులు చేస్తే.. న్యూజిలాండ్ జట్టు 179 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా చివరి వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే.. న్యూజిలాండ్ జట్టు కేవలం 17 పరుగుల మాత్రమే భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 217 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.
Cam Green and Josh Hazlewood’s 116-run partnership was Australia’s highest for the 10th wicket v New Zealand, and fourth highest overall in men’s Tests #NZvAUS pic.twitter.com/UQ1N57Zh4a
— 7Cricket (@7Cricket) March 1, 2024