India vs Australia 3rd ODI : మొదటి రెండు వన్డే లలో బలమైన ఆస్ట్రేలియా మీద భారత్ ఆధిపత్యం కొనసాగింది. మొదటి వన్డేలో చేజింగ్ చేసి, రెండవ వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసి.. భారత్ విజయాలు సాధించింది. ఈ విజయాలతో త్వరలో స్వదేశంలో ప్రారంభమయ్యే వరల్డ్ కప్ కు తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకుంది. కేఎల్ రాహుల్ నుంచి మొదలుపెడితే అందరూ రాణించడంతో ఇక వరల్డ్ కప్ లో భారతదేశానికి తిరుగు లేదని అందరూ అనుకున్నారు. మొదటి రెండు వన్డేలు గెలిచిన భారత్..రాజ్ కోట్ వేదికగా జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియా మీద క్లీన్ స్వీప్ సాధించాలని భావించింది. ఈ క్రమంలో మొదటి రెండు మ్యాచ్ లలో భారత విజయానికి కారకుడైన గిల్ కు విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇచ్చింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్, స్మిత్, లబూ షేన్, వార్నర్, తోడ్పాటుతో ఏడు వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీశాడు. వార్నర్, షాన్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ ఉన్నంతసేపు ఆస్ట్రేలియా రన్ రేట్ 8 గా నమోదయింది. లబూ షేన్ కూడా దాటిగానే ఆడాడు. ఆ తర్వాత భారత బౌలర్లు ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. లేకుంటే ఆస్ట్రేలియా స్కోర్ భారీగా పెరిగేది. మరి ముఖ్యంగా చివరి ఓవర్లలో భారత బౌలర్లు వేసిన బౌలింగ్ మాత్రం ఆమోఘం.
అనంతరం చేజింగ్ కు దిగిన భారత జట్టు ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. క్రీజులో ఉన్నంత సేపు ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన వ్యక్తిగత స్కోరు 81 పరుగుల వద్ద ఉన్నప్పుడు మ్యాక్స్ వెల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మకు భాగస్వామిగా వచ్చిన వాషింగ్టన్ సుందర్ తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. సుందర్ అవుట్ అయిన తర్వాత బరిలోకి వచ్చిన విరాట్ కోహ్లీ దాటిగానే ఆడాడు. 53 పరుగులు చేసిన అతడు కూడా మ్యాక్స్ వెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వీరు ముగ్గురు అవుట్ అయ్యే నాటికి భారత స్కోరు 171 పరుగులుగా ఉంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ పునర్ నిర్మించే బాధ్యతను ఎత్తుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 50 పరుగులు జోడించిన అనంతరం స్వల్ప వ్యవధిలోనే వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండవ వన్డేలో సుడిగాలి ఇన్నింగ్స్ ద్వారా ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో మెప్పించలేకపోయాడు. 8 పరుగులు మాత్రమే చేసి హాజిల్ వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికే భారత్ ఓటమి దాదాపు ఖాయమైంది. అయితే క్రీజు లో అయ్యర్, జడేజా ఉండడంతో ఎక్కడో ఒక మూల ఆశ ఉంది. అయితే వీరిద్దరూ భారీ షాట్లు ఆడే క్రమంలో అవుట్ అయ్యారు. దీంతో అప్పటికే ఓవర్లు తరిగిపోయి రన్ రేట్ పెరిగింది. ఇక మిగతా బుమ్రా, సిరాజ్, కులదీప్ యాదవ్ ఔట్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాక్స్ వెల్ నాలుగు కీలక వికెట్లు తీసి భారత పరాజయానికి ప్రధాన కారకుడయ్యాడు.. హజిల్ వుడ్ రెండు వికెట్లు తీశాడు..స్టార్క్, కమిన్స్, సంగా, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.