AUS Vs NZ: స్వదేశంలో పోరాడకుండానే చేతులెత్తేశారు..

తొలి ఇన్నింగ్స్ లో 383 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ జట్టును 179 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. లయన్ ధాటికి కివీస్ టాప్ ఆర్డర్ పేక మేడలా కూలింది.

Written By: Suresh, Updated On : March 3, 2024 9:35 am

AUS Vs NZ

Follow us on

AUS Vs NZ: రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పై 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.. ఇది జట్ల మధ్య రెండో టెస్టు క్రైస్ట్ చర్చి వేదికగా మార్చి 8 నుంచి ప్రారంభమవుతుంది.

తొలి ఇన్నింగ్స్ లో 383 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ జట్టును 179 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. లయన్ ధాటికి కివీస్ టాప్ ఆర్డర్ పేక మేడలా కూలింది. కామెరూన్ గ్రీన్ 174 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలవడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. అనంతరం రెండవ ప్రారంభించిన ఆస్ట్రేలియా 164 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఈ క్రమంలో 300 పై చిలుకు పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 196 పరుగులకే ఆల్ ఔట్ 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. స్వదేశంలో పోరాడకుండానే తొలి టెస్ట్ ఓడిపోయిందనే అపప్రదను మూటకట్టుకుంది.

మూడు వికెట్ల నష్టానికి 69 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు.. నాలుగో వికెట్ కు 57 పరుగులు జోడించింది.. రచిన్ రవీంద్ర(59), మిచెల్(38) పరుగులు చేసి సౌకర్యవంతంగా ఉన్న తరుణంలో.. వీరిద్దరి జోడిని లయన్ విడదీశాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 4 వికెట్లు నష్టానికి 126 పరుగులు.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వెంట వెంటనే అవుట్ కావడంతో న్యూజిలాండ్ జట్టు కష్టాల్లో పడింది. రవీంద్ర, బ్లాండిల్, ఫిలిప్స్.. ఇలా కీలకమైన మూడు వికెట్లు రెండు పరుగుల వ్యవధిలో కోల్పోవడంతో న్యూజిలాండ్ జట్టు కోలుకోలేక పోయింది. కుగెల్ జిన్,హెన్రీ చివర్లో ఎదురుదాడికి దిగేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ఫలితంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 196 పరుగుల వద్ద ముగిసింది.

తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు పై నాలుగు వికెట్లు తీసిన స్పిన్నర్ లయన్.. రెండవ ఇన్నింగ్స్ లో మరింత విశ్వరూపం చూపించాడు. ఏకంగా ఆరు వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టు పతనాన్ని శాసించాడు.. లాథమ్, విలియమ్సన్, రవీంద్ర, బ్లండిల్, ఫిలిప్స్, సౌతీ వంటి కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 126-4 వద్ద ఉన్న న్యూజిలాండ్ జట్టు లయన్ ధాటికి మిగతా వికెట్లను 70 పరుగుల వ్యవధిలో కోల్పోయిందంటే అతడి బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మూడు టి20 సిరీస్ ను 0-3 తో కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు.. రెండు టెస్టుల సిరీస్ లో 0-1 తేడాతో వెనుకంజలో ఉంది.