Australia Vs Scotland: ఆస్ట్రేలియా విజయం.. బతికి బట్ట కట్టిన ఇంగ్లాండ్

స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ఆశించినంత గొప్పగా ప్రారంభం కాలేదు. ఓపెనర్ మైకేల్ జోన్స్ రెండు పరుగులు మాత్రమే చేసి అగర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన బ్రాండెడ్ మెక్ ముల్లెన్, మున్నీ స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ను భుజాలకెత్తుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 16, 2024 10:57 am

Australia Vs Scotland

Follow us on

Australia Vs Scotland: టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం సెయింట్ లూసియా వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా స్కాట్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. స్కాట్లాండ్ జట్టులో మున్సి (23 బంతుల్లో 35), బ్రాండన్ మెక్ ముల్లన్ (34 బంతుల్లో 60), బేరింగ్ టన్ (31 బంతుల్లో 42) దూకుడుగా బ్యాటింగ్ చేశారు. చివర్లో మ్యాథ్యూ క్రాస్ (11 బంతుల్లో 18 పరుగులు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో స్కాట్లాండ్ 180 పరుగులు చేసింది. మాక్స్ వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అగర్, నాథన్ ఎల్లిస్, జంపా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ఆశించినంత గొప్పగా ప్రారంభం కాలేదు. ఓపెనర్ మైకేల్ జోన్స్ రెండు పరుగులు మాత్రమే చేసి అగర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన బ్రాండెడ్ మెక్ ముల్లెన్, మున్నీ స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ను భుజాలకెత్తుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 89 పరుగులు జోడించారు. ఈ తరుణంలో మాక్స్ వెల్ బౌలింగ్లో మున్నీ భారీ షాట్ కు యత్నించి, క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొంతసేపటికి బ్రాండ్ మెక్ ముల్లెన్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో బేరింగ్ టన్, మాథ్యూ క్రాస్ దూకుడుగా ఆడారు. స్కాట్లాండ్ స్కోర్ ను పరుగులు పెట్టించారు. ధాటిగా ఆడే క్రమంలో క్రాస్ అవుట్ అయినప్పటికీ.. బేరింగ్టన్ జోరు తగ్గించలేదు. ఫలితంగా స్కాట్లాండ్ 180 పరుగులు చేసింది.

181 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కు అదిరిపోయే ఆరంభం లభించలేదు. ప్రమాదకరమైన డేవిడ్ వార్నర్ ఒక్క పరుగు మాత్రమే చేసి వీల్ బౌలింగ్లో బేరింగ్టన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ మిచెల్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా 8 పరుగులు చేసి సఫియాన్ షరీఫ్ బౌలింగ్లో చార్లీ టియర్ కు క్యాచ్ ఇచ్చి వెను తిరిగాడు. మాక్స్ వెల్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి మార్క్ వాట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన మార్కస్ స్టోయినీస్(29 బంతుల్లో 59) దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49 బంతుల్లో 68) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆస్ట్రేలియా విజయం వైపు పరుగులు తీసింది. హెడ్, స్టోయినీస్ 15 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివర్లో టీమ్ డేవిడ్ 14 బంతుల్లో 24 పరుగులు చేసి ఆస్ట్రేలియా కు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా టేబుల్ టాపర్ గా నిల్వగా.. స్కాట్లాండ్ ఇంటిదారి పట్టింది. మరోవైపు స్కాట్లాండ్ ఓడిపోవడంతో ఇంగ్లాండ్ సూపర్ -8 కు లైన్ క్లియర్ అయింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, షరీఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. బ్రాడ్ వీల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.