AUS Vs SA Second T20: అతని వయసు జస్ట్ 22 సంవత్సరాలు. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడాడు. కాకపోతే అతడికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. అవకాశాలు రాకపోతేనేం.. వచ్చిన ఆపర్చునిటీని అద్భుతంగా వినియోగించుకున్నాడు. జాతీయ జట్టు టి20 టోర్నీ ఆడితే తన పేరు ముందు వరుసలో ఉండేలాగా చూసుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి.. కంగారు జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Also Read: ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రసంగం ప్రణాళిక ప్రకారమే ఇచ్చాడా..? టీడీపీ నే టార్గెట్ చేశాడా?
కంగారు జట్టుతో సఫారీ జట్టు మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. సఫారి దేశం వేదికగా జరుగుతున్న ఈ సిరీస్లో.. తొలి మ్యాచ్లో కంగారు జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్ మంగళవారం డార్విన్ వేదికగా మర్రారా స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేసి ఏడు వికెట్లు కోల్పోయి 218 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆతిథ్య జట్టు ఈ స్థాయిలో పరుగులు చేయడానికి ప్రధాన కారణం డెవాల్డ్ బ్రెవిస్. ఇతడు 56 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సఫారి జట్టును కాపాడాడు. స్టబ్స్ తో కలిసి నాలుగో వికెట్ కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా ఆతిథ్య జట్టు పటిష్ట స్థితికి చేరుకొంది. 31 పరుగులు చేసిన స్టబ్స్ అవుట్ అయినప్పటికీ.. బ్రెవిస్ ఒంటరి పోరాటం చేశాడు. తద్వారా అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నాడు.
పొట్టి ఫార్మాట్లో సఫారీ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బ్రెవిస్(125*) నిలిచాడు.
కంగారు జట్టుపై పొట్టి ఫార్మేట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ (41 బంతులలో) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు (125*) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
సఫారీ జట్టు తరఫున పొట్టి ఫార్మాట్లో శతకం చేసిన చిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
దక్షిణాఫ్రికా విధించిన 219 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో ఆస్ట్రేలియా ప్రారంభం నుంచి తడబడింది. డేవిడ్ (50) మినహా మిగతా ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు.. ఆతిధ్య జట్టు బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు 165 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఆతిథ్య జట్టు 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ సమం అయింది. ఆతిథ్య జట్టులో మఫాకా, బోస్ చెరి మూడు వికెట్లు సాధించారు. ఇక ఈ సిరీస్ లో విజేతను నిర్ణయించే మూడో మ్యాచ్ ఈనెల 16వ తేదీన కెయిర్న్స్ వేదికగా జరుగుతుంది.