Aus Vs Eng Ashes: 2012లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా గడ్డమీద టెస్ట్ విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరోసారి టెస్ట్ గెలుపును అందుకోలేకపోయింది. దీన్నిబట్టి ఆస్ట్రేలియా గడ్డమీద కంగారు జట్టు ఏ స్థాయిలో పటిష్టంగా ఉంది? ఇంగ్లాండ్ జట్టు ఏ విధంగా ఇబ్బందిపడుతుంది? అనే విషయాలను అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియన్ గడ్డమీద యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు గెలిచిన విధానం.. ఇంగ్లాండ్ జట్టు ఓడిన విధానం చూస్తే.. రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ జెఫ్రీ బాయ్ కాట్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొత్తం చెత్తతో నిండిపోయిందని.. ప్రక్షాళన అవసరమని వ్యాఖ్యానించారు.పెర్త్ టెస్టులో ఓడిపోయిన తర్వాత బాయ్ కాట్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఓడిపోయిన బాధలో ఆయన అలా చేసి ఉండవచ్చని చాలామంది అనుకున్నారు. కానీ గణాంకాలను పరిశీలిస్తే ఆయన చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజం అని తెలుస్తోంది.
2013లో ఆస్ట్రేలియా గడ్డమీద యాషెస్ సిరీస్ జరిగినప్పుడు ఇంగ్లాండ్ ఐదు టెస్టులు ఓడిపోయింది. 2017లో ఆస్ట్రేలియా గడ్డమీద జరిగిన సిరీస్ లో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు ఓడిపోయింది. 2021లో నాలుగు టెస్టులు ఓడిపోయింది. ఇక ప్రస్తుత సిరీస్లో ఇంగ్లాండ్ ఇప్పటికే ఒక టెస్ట్ ఓడిపోయింది.. వాస్తవానికి పెర్త్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు గెలవాలి. 40 పరుగుల లీడ్ లభించినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఆ పట్టు నిలుపుకోలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో దారుణంగా బ్యాటింగ్ చేసింది. బౌలింగ్ కూడా అదే స్థాయిలో ఉండడంతో ఆస్ట్రేలియా జట్టు పండగ చేసుకుంది. ఇప్పటికైనా ఈ లోపాల నుంచి ఇంగ్లాండ్ జట్టు పాఠాలు నేర్చుకుంటే తదుపరి మ్యాచ్లలో గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అలాకాకుండా ఇవే లోపాలను గనుక ప్రదర్శిస్తే ఆస్ట్రేలియా జట్టు సిరీస్ మొత్తాన్ని వైట్ వాష్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టు కూడా అత్యంత దారుణంగా ఉంది.. ఆటగాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు.. రూట్, క్రావ్ లీ, స్టోక్స్ లాంటి ప్లేయర్లు విఫలమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.. వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో కూడా ఈ స్థాయి ఆటగాళ్లు విఫలం కావడం ఇంగ్లాండ్ జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది.