Asia Cup Final 2023: భారత్ గెలుస్తుందా? లేక శ్రీలంక విజయం సాధిస్తుందా? యువ రక్తంతో నిండిన జట్లు ఎటువంటి అంచనాలు సిద్ధం చేసుకున్నాయి? ఎవరి బలాలు ఏంటి? ఎవరి ఆస్త్రాలు ఏంటి? మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఓవైపు అత్యధికంగా 13సార్లు ఫైనల్‌కు చేరిన శ్రీలంక.. ఎక్కువ టైటిళ్ల (7)తో ఆసియా కప్ లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్ మరోవైపు.. వెరసి ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర ఫైనల్‌కు తెర లేవనుంది. అయితే టైటిళ్లు ఎక్కువే ఉన్నా టీమిండియా చివరిసారి 2018లో విజేతగా నిలిచింది. ఈ సుదీర్ఘ విరామానికి తాజాగా తెరదించాలన్న పట్టుదలతో భారత్ ఉంది. అంతేకాదు..ఈ ట్రోఫీ నెగ్గి సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్‌క్‌పలో ఫేవరెట్ హోదాలో పోటీ పడాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ లక్ష్యం నెరవేర్చుకుంటుందా? లేదంటే సూపర్-4లో రోహిత్ సేన చేతిలో
ఎదురైన పరాభవానికి లంక ప్రతీకారం తీర్చుకుంటుందా? నేడు తేలనుంది.
శ్రీలంక ఎగరేసుకుపోయింది
గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాక్‌పలో భారత్ సూపర్-4 దశను దాటలేకపోయింది. ఫైనల్లో పాక్‌ను ఓడించిన శ్రీలంక టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇప్పుడు వరల్డ్‌క్‌పనకు సన్నాహకంగా వన్డే ఫార్మాట్‌లో ఆసియాక్‌పను నిర్వహిస్తున్నారు. ఈసారీ లంకేయులు ఫైనల్‌కు చేరగలిగారు. శ్రీలంక జట్టు ఈ టోర్నీలో ఎంత ప్రమాదకరమో దీన్ని బట్టి తెలుస్తుంది. టైటిళ్లు కూడా భారత్‌కన్నా ఒకటి మాత్రమే తక్కువ. ఈసారి ఆ లెక్కను సమం చేయాలనుకుంటోంది. అటు టీమిండియా బంగ్లాదేశ్‌పై అనూహ్య ఓటమితో ఫైనల్ పోరుకు సిద్ధమవుతోంది. కోహ్లీ, హార్దిక్ మినహా స్టార్ ఆటగాళ్లంతా ఆడినా ఓటమి తప్పలేదు. ఈ టోర్నీలో నేపాల్, పాక్ జట్లపైనే భారత్ సంపూర్ణ ఆధిపత్యం చూపింది. నేటి ఫైనల్‌లో భారత్ నుంచి అక్షర్, శ్రీలంక నుంచి తీక్షణ గాయం కారణంగా దూరమవుతున్నారు.
కీలక టోర్నీల్లో తడబడుతోంది
2018 ఆసియాకప్ గెలుచుకున్నప్పటి నుంచి భారత జట్టు కీలక టోర్నీల్లో తడబడుతోంది. అందుకే ఇప్పటివరకు ఒక్క మెగా టైటిల్ కూడా నెగ్గలేకపోయింది. ఇక నేటి ఫైనల్లో పూర్తి స్థాయి ఆటగాళ్లతో అమీతుమీ తేల్చుకోనుంది. విరాట్, హార్దిక్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ బలమైనట్టే. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో గిల్ మినహా అంతా విఫలమయ్యారు. అలాగే 59/4తో పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాను త్వరగా ఆలౌట్ చేయడంలోనూ బౌలర్లు చేతులెత్తేశారు. డెత్ ఓవర్లలో పరుగుల వరద పారింది. బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్ రాకతో ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలని చూస్తోంది. ఇక గాయపడిన అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను భారత్ నుంచి రప్పించారు. అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? వేచిచూడాల్సిందే.
జట్ల కూర్పు ఇలా..
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, రాహుల్, హార్దిక్, జడేజా, వాషింగ్టన్ సుందర్/శార్దూల్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.
శ్రీలంక: నిస్సాంక, పెరీరా, మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ, షనక (కెప్టెన్), వెల్లలగె, మధుషన్, రజిత, పథిరన.
వాతావరణం
ఆదివారం ఇక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే… రిజర్వ్‌డే ఉన్నందున సోమవారం ఫైనల్ నిర్వహిస్తారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Asia cup final 2023 india and sri lanka will fight in the final whose strengths are
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com