Asia cup 2025 India Jersey: టీమిండియా క్రికెట్ చరిత్రలో తొలిసారిగా జెర్సీ పై ఎటువంటి అధికారిక ప్రయోజక కర్త లేకుండా ఆటగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. నీలం రంగులో రూపొందించిన దుస్తులు ధరించి మైదానంలో అదరగొట్టడానికి సిద్ధమయ్యారు. ఆసియా కప్ కోసం ఇప్పటికే టీం ఇండియా యూఏఈ వెళ్ళిపోయింది. అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఆటగాళ్లు సమరోత్సాహంతో కనిపిస్తున్నారు. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తామని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. టీ మీడియా ఆటగాళ్ల ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేస్తోంది. ఇందులో ఆటగాళ్లు వీరొచితంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. మధ్యలో ఫీల్డింగ్ చేసుకుంటూ అదరగొడుతున్నారు.
ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటిదాకా భారత క్రికెట్ జట్టుకు ప్రయోజక కర్తగా వ్యవహరించిన సంస్థ తప్పుకుంది. దీంతో భారత క్రికెట్ జట్టుకు ప్రయోజక కర్త కావలసిన అవసరం ఏర్పడింది. అయితే తాత్కాలికంగా ప్రయోజక కర్తను ఏర్పాటు చేస్తే ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ లో ఎటువంటి ప్రయోజక కర్త సంకేతం లేకుండానే జెర్సీలను రూపొందించింది. ఆ జెర్సీలు ఆటగాళ్లు ధరించి అభిమానులను ఉత్తేజపరిచారు. ఆసియా కప్ మీద అంచనాలు పెంచే విధంగా ఉద్వేగపూరితమైన మాటలు మాట్లాడారు. ఆ మాటలు ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుకు డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నాయని అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యానిస్తున్నారు..
భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. గిల్ ఉపసారధిగా కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి వారు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరంతా కూడా కొత్త జెర్సీలు ధరించి సమరోత్సాహంతో కనిపిస్తున్నారు. “ఆసియా కప్ చాంపియన్లు మళ్లీ వచ్చారని” సారధి సూర్య కుమార్ యాదవ్ అంటే..”దీనిని మేము అంత తేలికగా తీసుకునేది లేదు. మాకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా అమలు చేస్తామని” సంజు శాంసన్ వ్యాఖ్యానించాడు. “మేము గౌరవం, ప్రతిష్ట కోసం పోరాడుతున్నాం. అంత సులువుగా మా దగ్గర నుంచి తీసుకోవడం సాధ్యం కాదు. ఏదైనా సరే వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమని” హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. “ఇది దేశం కల. అది నెరవేరబోతుంది. ఆ దిశగానే మా ప్రయత్నం ఉంటుందని” పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ అన్నాడు.
View this post on Instagram