Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియాలో డ్యాషింగ్ ఓపెనర్. అతడు ఆడితే మైదానం ఊగిపోయేది. ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టేది. మంచినీళ్లు తాగినంత సులభంగా అతడు బౌండరీలు కొట్టేవాడు. జెర్సీ వేసుకున్నంత సులువుగా సిక్సర్లు కొట్టేవాడు. చూస్తుండగానే చాప కింద నీరు లాగా ఇన్నింగ్స్ నిర్మించేవాడు. ఎంత గొప్ప స్కోరైనా సరే తను ఉన్నంతసేపు మెరుపులు మెరూపించేవాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేసేవాడు. అందువల్లే అతడిని టీమ్ ఇండియాలో భయంలేని ఓపెనర్ అని పిలుస్తుంటారు. సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించి ఇన్ని సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ.. అతడి స్థానాన్ని భర్తీ చేసే మరొక ఆటగాడు రాలేదంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
వీరేంద్ర సెహ్వాగ్ తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అపూర్వం అనుకునే పరుగులు సాధించాడు. అయితే అతడి కెరియర్లో అద్భుతంగా నిలిచిపోయే సెంచరీ ఒకటి ఉంది. అది ఆస్ట్రేలియాపై చేసింది కాదు. న్యూజిలాండ్ జట్టుపై అంతకన్నా కాదు. అతడు చేసిన సెంచరీ దాయాది పాకిస్తాన్ మీద.. 2008లో జరిగిన మ్యాచ్లో అతడు వీరోచితమైన ఆట తీరు ప్రదర్శించాడు. కరాచీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో సెహ్వాగ్ 95 బంతులు ఎదుర్కొని 119 పరుగులు చేశాడు. అయితే అంతటి బీభత్సమైన బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్.. ఆరోజు కఠినమైన ఉపవాసం ఉన్నాడు.
సెహ్వాగ్ పాకిస్తాన్తో ఆడిన ప్రతిసారి తన టెంపర్మెంట్ కోల్పోతాడు. అందువల్లే ఆరోజు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నాడు కాబట్టి కచ్చితంగా లక్ష్యాన్ని చేదించాలి అనే దిశగా బ్యాటింగ్ చేశాడు. 300 కు మించిన పరుగుల స్కోరును భారత జట్టు ఆరోజు చేదించింది. దాని కారణం వీరేంద్ర సెహ్వాగ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటి మ్యాచ్లో భారత్ కేవలం 4 టికెట్లు మాత్రమే కోల్పోయి అంత పెద్ద లక్ష్యాన్ని చేదించింది. తద్వారా పరిమిత ఓవర్లలో అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. ఇదే విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆరోజు భావోద్వేగానికి గురయ్యానని.. ఉపవాసం ఉన్నప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా బ్యాటింగ్ చేశానని.. తన కెరియర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ లలో ఆ సెంచరీ ఒకటి అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.